Niqab: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ముస్లిం మహిళలు ముఖం, శరీరాన్ని కప్పి పుచ్చుకునేందుకు ముసుగు ధరిస్తారు. ఇస్లాం ఆచారం ప్రకారం ఇతర మతస్తులు, పరాయి పురుషులకు తమ ముఖం చూపించకూడదనే నమ్మకాన్ని ముస్లిం స్త్రీలు బలంగా విశ్వసిస్తారు. ఇందులో భాగంగానే బుర్కా, హిజాబ్, నిఖాబ్ ధరిస్తారు. అయితే బుర్కా, హిజాబ్ అంటే చాలామందికి తెలుసు. కానీ నిఖాబ్ అంటే ఏమిటి(What is Niqab?), దీని ప్రత్యేకలేంటో ముస్లిమేతరులకు పెద్దగా అవగాహన లేదనేది వాస్తవం. అయితే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ముస్లిం మహిళల ముఖాలు చూపించాలంటూ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత నిఖాబ్ పైకెత్తి పరిశీలించడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే నిఖాబ్ పై ఆసక్తికరమైన చర్చ మొదలవగా.. అసలు ఈ నిఖాబ్(Niqab) మతలాబేంటో మనము తెలుసుకుందాం.
కళ్లు మాత్రమే బయటకు..
ఈ మేరకు నిఖాబ్(Niqab) ధరించే స్త్రీలను తరచుగా నిఖాబియా అని పిలుస్తారు. హిజాబ్ అనేది జుట్టు, మెడ భాగం కవర్ అయ్యేలా ఉంటుంది. బురఖా ముఖం, శరీరం మొత్తాన్ని కప్పేస్తూ కేవలం కళ్ల దగ్గర మాత్రమే కాస్త వెసులుబాటుగా ఉంటుంది. ఇక నిఖాబ్ మాత్రం కేవలం కళ్లు మాత్రమే బయటకు కనిపించేలా, ముఖం మొత్తాన్ని కవర్ చేసేలా ఉంటుంది. దీన్ని హెడ్స్కార్ఫ్తో పాటుగా ధరిస్తారు. ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్.. ముస్లిం పురుషులు, మహిళలు అణుకువగా ఉండే దుస్తులు ధరించాలని చెబుతుంది. పురుషులు నాభి నుంచి మోకాలివరకు కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. ముస్లిం మహిళలు.. తమకు బంధువులు కాని, సంబంధం లేని పురుషుల సమక్షంలో ముఖం, కాళ్లు, చేతులు ఏవీ కనిపించకుండా దుస్తులు ధరించాలని సూచిస్తుంది. ఇది అరబ్ దేశాలలో ఎక్కువగా ముస్లిం మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన నిఖాబ్.. 1970 తర్వాత ఉత్తర ఆఫ్రికా, ముఖ్యంగా సున్నీ ముస్లింలలో వ్యాపించింది.
ముస్లిం మెజారిటీ దేశాల్లో పెరిగిన కల్చర్..
ప్రపంచవ్యాప్తంగా అనేక ముస్లిం మెజారిటీ దేశాలలో సౌదీ అరేబియా మార్కెట్ స్పాన్సర్షిప్ పెరిగింది. దీని ఫలితంగా సౌదీ ఇస్లామిక్ కు సంబంధించిన మత సాంస్కృతి ప్రాముఖ్యత పెరగడంతో నిఖాబ్ కల్చర్ అంతటా వ్యాపించింది. 20వ శతాబ్దం తర్వాత మొత్తం అరబ్ దేశాలతోపాటు మరికొన్ని ముస్లిమేతర దేశాల్లోనూ నిఖాబ్ సంస్కృతి ఇది ఆధిపత్యం చెలాయిస్తుంది. 2000 సంవత్సరం నుంచి యునైటెడ్ స్టేట్స్లో నిఖాబ్ కు మరింత ఆదరణ లభించింది. మరికొందరు మాత్రం స్త్రీ వెంట్రుకలను కప్పి ఉంచే పద్ధతి ఇస్లాం పుట్టకముందే ఆచరణలో ఉందని చెబుతున్నారు. యూదుల చట్టం ప్రకారం వివాహిత స్త్రీలు తమ శరీరం, జుట్టును కప్పుకోవాలి. భర్త, కొడుకు తండ్రి, తాత, మనవలు లేదా సోదరుడు తప్పా మరొక పురుషుడికి చూపించకూడదు.
ఇది కూడా చదవండి: Sex Scandal Case: సెక్స్ స్కాండల్ కేసు నిందితుడు రేవణ్ణకు బెయిల్!
ఇస్లాం తీవ్రవాదానికి సంకేతంగా..
కొంతమంది ముస్లింలు నిఖాబ్ ను ఇస్లామిక్ తీవ్రవాదానికి సంకేతంగా భావిస్తారు. అరేబియా ద్వీపకల్పం వెలుపల ఉన్న అనేక మంది ముస్లింలు నిఖాబ్ను తమ మతంపై ‘ఛాందసవాదానికి చిహ్నం’గా పేర్కొంటారు. ఎందుకంటే 1990లలో జరిగిన అల్జీరియన్ అంతర్యుద్ధంలో ఇస్లాం తీవ్ర వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనే నిఖాబ్ ఉనికి గణనీయంగా పెరిగిందని, అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు చెబుతుంటారు.
యూరోపియన్ దేశాల్లో వ్యతిరేకత..
యూరోపియన్ దేశాల్లో ముస్లిం సంప్రదాయాలపై వ్యతిరేకత ఉంది. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాల్లో బురఖాలు, నిఖాబ్లపై ఆంక్షలు విధించాయి. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు, నిఖాబ్లను ఫ్రాన్స్ 2011లోనే నిషేధించగా.. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈ చర్యను సమర్థించింది. 2018లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ బురఖాలపై నిషేధాన్ని విమర్శించింది. ఇలాంటి చర్యలు ముస్లిం మహిళల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కమిటీ పేర్కొంది. నిషేధాజ్ఞల కారణంగా ఒక వర్గం మహిళలు ఇళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. కానీ, యూరోపియన్ దేశాలు మాత్రం ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవట్లేదు. మరిన్ని దేశాల్లోనూ ఫేస్ కవరింగ్స్పై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.