Unicef: ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు యునిసెఫ్(UNICEF) తెలిపింది. ప్రతి నలుగురిలో ఒకరు పేదరికం కారణంగా సరైన భోజనం లేక ఇబ్బందిపడుతున్నట్లు తెలిపింది. చైల్డ్ ఫుడ్ పావర్టీ, న్యూట్రిషన్ డిప్రివేషన్ ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ అనే పేరుతో నిర్వహించిన సర్వేలో నలుగురు పిల్లల్లో ఒకరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆహారాన్ని తీసుకుటుండగా కొన్నిసార్లు అది కూడా దొరకడం లేదని చెప్పింది. దాదాపు 181 మిలియన్ల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపానికి గురికావడం వల్ల శారీరక పెరుగుదల, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదిక తెలిపింది.
ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన పిల్లల ఆహార పేదరికం ప్రబలంగా ఉందని నివేదిక పేర్కొంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం 18 కోట్ల మంది పిల్లల్లో 65 శాతం మంది భారతదేశం, గినియా, ఆఫ్ఘనిస్తాన్, బుర్కినా ఫాసో, ఇథియోపియాతో సహా కేవలం 20 దేశాల్లో ఉన్నారని తెలిపింది. దక్షిణాసియాలోనే 64 మిలియన్లు, సోమాలియా, గాజా స్ట్రిప్‌లో 63 శాతం మంది పిల్లలు తీవ్రమైన ఆహార పేదరికాన్ని అనుభవిస్తున్నట్లు వెల్లడించింది. పది మంది పిల్లల్లో తొమ్మిది మంది తీవ్రమైన ఆహార పేదరికంలో జీవిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇక పిల్లల ఆహార పేదరికంలో బెలారస్ అత్యల్ప స్థాయిని కలిగి ఉండగా బాధిత పిల్లల్లో 46 శాతం మంది పేద కుటుంబాలలో, 54 శాతం మంది దారిద్రరేఖకు ఎగువన ఆదాయం ఉన్న కుటుంబాలలో ఉన్నట్లు పేర్కొంది.
పేదరికం కారణంగా పిల్లలకు సరైన ఆహారం అందించని మొదటి 25 దేశాలలో భారత్ ఒకటి. ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ పిల్లలు ఎక్కువగా తీవ్రమైన ఆహార పేదరికంలో జీవిస్తున్నారని నివేదిక వెల్లడించింది.