Maharastra: మహారాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘అర్బన్ నక్సలిజం’ను రూపుమాపేందుకు ‘మహారాష్ట్ర ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు- 2024’ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీకి సానూకూలంగా ఉండే వ్యక్తులు, 48 నిషేధిత సంస్థల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ బిల్లులో పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఆమోదించిన ప్రజా భద్రతా చట్టం తరహాలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
ఏ సంస్థను ఉపేక్షించే ప్రసక్తే లేదు..
ఇక మావోయిస్టుల ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవు కాబట్టే.. మావోయిజానికి సహకరించే సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ఉదయ్ సమంత్ వెల్లడించారు. మహారాష్ట్రలోని చాలా నగరాల్లో మావోయిస్టులకు సురక్షిత స్థావరాలు ఉన్నాయని దర్యాప్తుల్లో గుర్తించినట్లు తెలిపారు. మావోయిస్టులను ప్రోత్సహించే ఏ సంస్థను కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నిషేధానికి గురయ్యే సంస్థల కార్యకలాపాలలో పాల్గొనే లేదా సహకరించే వారికి 3ఏళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. మావోయిస్టుల ప్రణాళికల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగమయ్యే వారికి 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లులో స్పష్టం చేశారు.