దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతోనే మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీ మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఉదయం 9.26 గంటలకు సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 65,632 దగ్గర, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 19,572 దగ్గర ట్రేడవుతున్నాయి.
నిన్న ఒక్క రోజులోనే లక్షల కోట్ల సంపద ఆవిరి…
ఒక్కరోజులోనే 2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. మదుపర్ల అమ్మకాలు ఎక్కువగా జరగడంతో సెన్సెక్స్, నిఫ్టి దాదాపు 1 శాతం నష్టపోయాయి. విదేశీ అమ్మకాలు కొనసాగడం, అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండడం కూడా దేశీయ మార్కెట్ ను దెబ్బతీశాయి. రిలయన్స్, ఐటీసీ లాంటి పెద్ద పెద్ద షేర్లు కూడా కుదేలయ్యాయి. సూచీల నష్టాలు చూపించడంతో బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే సంస్థల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ. 2.95 లక్షల కోట్లు తగ్గిపోయి రూ.316.65 లక్షల కోట్లకు చేరింది.
ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్…మధ్యాహ్నం వరకు స్థిరంగానే ఉంది. కానీ చివరకు వచ్చేసరికి నష్టాల్లో జారుకుని మళ్ళీ లేవలేకపోయింది. ఇంట్రాడేలో 65,423.39 పాయింట్ల దగ్గర కనిష్టానికి తాకి చివరకు 610.37 పాయింట్ల నష్టంతో 65,508.32 దగ్గర ముగిసింది. నిఫ్టీ 192.90 పాయింట్లు కోల్పోయి 19,523.55 దగ్గర స్థిరపడింది. ఇక సెన్సెక్స్ 30 షేర్లలో 25 కుదేలయ్యాయి. టెక్ మహీంద్రా 4.59%, ఏషియన్పెయింట్స్ 3.97%, విప్రో 2.36%, ఎంఆండ్ఎం 2.10%, ఇన్ఫోసిస్ 1.91%, ఐటీసీ 1.87%, కోటక్ బ్యాంక్ 1.86%, బజాజ్ ఫిన్ సర్వ్ 1.72%, టైటన్ 1.66%, హెచ్యూఎల్ 1.64% నష్టపోయాయి. ఎల్ఆండ్టీ 1.69%, పవర్ గ్రిడ్ 0.73%, యాక్సిస్ బ్యాంక్ 0.60% లాభపడ్డాయి. బీఎస్ఈలో 2158 షేర్లు నష్టాలతో ముగిసాయి. 1504 స్క్రిప్ లు లాభపడ్డాయి. 128 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 1 రూపాయి 3 పైసలు పెరిగి 83.19 దగ్గర ముగిసింది. అలాగే బ్యారెల్ ముడిచమురు కూడా 0.38% పెరిగి 96.18 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.