Karnataka: కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలంటూ ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్ విజయం సాధించిన తర్వాత ఆయన మద్దతుదారులు కర్ణాటక అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేయడంపై రాజన్న ఈ విధంగా స్పందించారు.
అందులో తప్పు లేదు..
ఈ మేరకు రాజన్న మాట్లాడుతూ.. ‘ఏమైంది. కాంగ్రెస్ ఇమేజ్ బాగానే ఉంది. ఎవరైనా పాకిస్తాన్ జినాదాబాద్’ నినాదాలు చేసినా, పాకిస్థాన్‌కు మద్దతిచ్చినా.. ఆ వ్యక్తిని కాల్చిచంపండి. అందులో తప్పు లేదు’ అని అన్నారు. ఇక కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ నసీర్ హుస్సేన్ రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఫిబ్రవరి 27వ తేదీన ఓ కార్యక్రమం జరిగింది. విజయం సాధించిన ఆనందంలో ఓ కార్యకర్త ‘జై పాకిస్థాన్’ అనే నినాదాలు చేశాడు. దీంతో అక్కడ కలకలం ఏర్పడింది. రాష్ట్ర శాసనసభలో ప్రత్యర్థి దేశం అనుకూల నినాదాలు జరగడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. వారిపై కేసులు నమోదు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ వివాదం కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర ఆందోళనకు దారితీయగా రాజన్న ఇలా స్పందించారు.
ఇది కూడా చదవండి: Water Crisis: నగరవాసులకు అలర్ట్.. నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్!
అలాగే కర్నాటక మంత్రి రాజన్న.. ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ చర్యకు మద్దతు ఇచ్చారు. బుల్డోజర్లను ఉపయోగించి నిందితుల ఇళ్లను కూల్చివేయడం వంటి ప్రభుత్వ చర్యల ద్వారానే అధిక జనాభా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయన్నారు. ‘ఉత్తరప్రదేశ్‌లో ఇళ్లను కూల్చివేస్తారు. దానికి చట్టం లేదు. అయితే శాంతిభద్రతలు అదుపులో లేవని.. దానిని మేము వ్యతిరేకించబోము’ అని ఆయన అన్నారు.