యూరోపియన్ దేశంలో ఒక రాజకీయ నాయకుడిపై హింసను ప్రేరేపించిన కేసులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ అతను జైలు శిక్ష అనుభవించే ఛాన్స్ ఉంది. డచ్ నాయకుడు గ్రీట్ వైల్డర్స్‌ను హత్య చేయాలని ప్రజలను ప్రేరేపించినందుకు పాక్ మాజీ కెప్టెన్ ఖలీద్ లతీఫ్‌కు 12ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తులకు చెప్పినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. పాక్ తరుఫున 18 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ క్రికెటర్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూడా ఇరుక్కోవడంతో నిషేధానికి గురయ్యాడు.
ఇంతకీ ఏం జరిగింది?
2018లో లతీఫ్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. విల్డర్స్ను హత్య చేసినవారికి 3 లక్షల పాకిస్థాన్(కరెన్సీ) రూపాయలు లేదా 21,000 యూరోలు ఇస్తానని వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లాంపై వైల్డర్స్ చేసిన వ్యాఖ్యపై లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేవాడు. ముస్లిం ప్రవక్త మహమ్మద్ క్యారికేచర్లను చిత్రీకరించే కార్టూన్ని ప్లాన్ చేసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. చివరికి పోటీ రద్దయింది కానీ అప్పటికే లతీఫ్ ఈ వీడియోను పోస్ట్ చేసేశాడు. ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్త చిత్రాలు నిషిద్ధం. ఈ క్యారికేచర్లు ముస్లింలను తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయన్నది లతీఫ్ వాదన. లతీఫ్ పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోకు ఐదేళ్ల తర్వాత, అతనిపై హత్యను ప్రేరేపించడం, నేరపూరిత చర్యలకు ప్రేరేపించడం, వైల్డర్స్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టడం లాంటి అభియోగాలు మోపారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఖలీద్ లతీఫ్ ఎవరు?
ఖలీద్ లతీఫ్ 2008 జనవరిలో ఫైసలాబాద్‌లోని ఇక్బాల్ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. పాకిస్థాన్ తరఫున 5 వన్డేలు, 13 టీ20లు ఆడిన అతడు 2010 ఆసియా క్రీడల్లో మెన్ ఇన్ గ్రీన్ జట్టుకు నాయకత్వం వహించాడు. లతీఫ్ అంతర్జాతీయ కెరీర్ 2016లో ముగిసింది. అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలేవి లేవు. అండర్-19 వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకున్న లతీఫ్ సీనియర్ లెవల్ క్రికెట్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఓ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో లతీఫ్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టైంది. అతడిపై ఐదేళ్ల నిషేధం విధించారు. ప్రస్తుతం లతీఫ్ వయసు 37ఏళ్లు.. పాక్‌లోనే జీవిస్తున్నాడు.
గ్రీట్ వైల్డర్స్ అంటే ఎవరు?
నెదర్లాండ్స్‌లో ఇమ్మిగ్రేషన్ డిబేట్లో కీలక వ్యక్తిగా ఉన్న వైల్డర్స్ యూరోప్‌లోని ప్రముఖ ఫార్-రైట్ నాయకులలో ఒకరు. అంటే రైట్ వింగ్ లీడర్ అన్నమాట. వైల్డర్స్ ఎప్పుడూ ప్రభుత్వంలో లేరు. 2004 నుంచి పోలీసు రక్షణలో నివసిస్తున్న వైల్డర్స్ వివాదాస్పద రాజకీయ వ్యక్తి అని చెప్పవచ్చు. అతని రాజకీయ పార్టీ పీవీవీ ప్రధాన ప్రతిపక్షం, డచ్ పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీ. ఇక లతీఫ్ వర్సెస్ వైల్డర్స్ కేసులో సెప్టెంబర్ 11న కోర్టు తీర్పు వెలువరించనుంది.
ALSO READ: క్రికెట్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. రేపటి ఇండియా-పాక్ మ్యాచ్ డౌటేనా?