Kanipakam : ఏపీ (AP) లో సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి (Vara Siddhi Vinayaka Swamy) వారి ఆలయంలోనే బంగారం కొట్టేయాలనుకున్నాడు (Gold Theft).. ఓ బ్యాంకు ఉద్యోగి (Bank Employee). కానీ సత్య దేవుని ముందు నిజం బయట పడకుండ ఉంటుందా… దొంగ దొరికిపోయాడు. తప్పు చేసిన ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఇక్కడకు వచ్చి ప్రమాణం చేస్తే చాలు తన తప్పును ఇట్టే ఒప్పుకుంటారట. అందుకే శ్రీ కాణిపాకంలో సత్యప్రమాణాలకు సిద్ధమా అంటూ రాజకీయ నాయకులు సవాళ్లు చేసుకుంటుంటారు.
కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి దర్శనానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు (Devotees) వచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. భక్తులు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి బంగారు, వెండి, విదేశీ కరెన్సీ, నగదు కానుకల రూపంలో సమర్పించుకుంటారు. ప్రతి నెల శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో కౌంటింగ్ చేపడతారు. లెక్కింపును సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తుంటారు. కౌంటర్ సిబ్బంది కౌంటింగ్ అయ్యే వరకు అనునిత్యం పర్యవేక్షణ చేస్తునే ఉంటారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది చేపడుతారు. వచ్చిన హుండీ ఆదాయాన్ని వివిధ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థల్లో భద్రపరుస్తుంటారు.
నగదుతో పాటుగా వచ్చే వివిధ రకాల బంగారు., వెండి ఆభరణాలు… నాణేలను విలువ కట్టి… బ్యాంకులో భద్రపరిచేందుకు ఆయా బ్యాంకు అప్రైజర్స్ సైతం ఆలయానికి వస్తుంటారు. గురువారం కాణిపాకంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు, ఆలయ సిబ్బంది చేపట్టారు. ఇక బంగారాన్ని వెలకట్టేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రైజర్ ప్రకాష్ ఆలయానికి చేరుకున్నాడు. అప్పుడే ప్రకాష్ ఓ బంగారు బిస్కట్ కు ఆకర్షితుడైయ్యాడు. వెంటనే ఆ గోల్డ్ బిస్కట్ ను గుట్టుచప్పుడు కాకుండా తన బ్యాగులోకి చేర్చాడు. 10 లక్షలు విలువ గల 100 గ్రాముల బంగారు బిస్కెట్ చోరీ చేసి సైలెంట్ గా ఉన్నాడు.
ఇక కౌంటింగ్ ప్రక్రియ సీసీ కెమెరాలద్వారా పర్యవేక్షిస్తున్న సిబ్బంది ప్రకాష్ నిర్వాకాన్ని గుర్తించారు. వెంటనే ఆలయ అధికారులకు సిబ్బంది తెలియజేశారు. వెంటనే ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఒక బంగారపు బిస్కట్, 1.5 గ్రాముల ఉంగరం చోరీ చేసినట్లు నిర్థారించారు. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రకాష్ ను పట్టుకుని మధ్యాహ్నం 1 వరకు విచారణ చేపట్టారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేయనున్నారు.
Also read: 108 డిగ్రీల జ్వరంతో వ్యక్తి మృతి.. హడలిపోతున్న జనం!