Kaiga Project : నిర్మాణ రంగంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థ (MEGHA Engineering Company) వైఫల్యాలు వరుసగా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెనల్లో ప్రమాదం జరగడం, కాళేశ్వరం పంప్ హౌస్ నీటమునగడం, రిటైనింగ్ వాల్స్ కూలిపోవడం లాంటి ఘటనలు మేఘా కంపెనీ పనితననానికి అద్దం పడుతున్నాయి. కర్ణాటకలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPSCL) నియంత్రణలో ఉన్న ‘కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్’ (NPP).. భారత భవిష్యత్తుకు ఉపయోగపడే కీలక ఇంధన శక్తిగా భావిస్తారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన కైగా ప్రాజెక్టులో ప్రస్తుతం మేఘా ఇంజినీరింగ్ కంపెనీ లోయెస్ట్ బిడ్డర్ (L1) గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మేఘా కంపెనీ చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగిన చరిత్ర ఉండడం ఇప్పుడు కర్ణాటకలో కూడా కలకలం రేపుతోంది.
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, భద్రతలో నాణ్యమైన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్మాణాల్లో ఏదైనా లోపం జరిగితే ఘోర విపత్తు పరిణామాలకు దారితీస్తుస్తుంది. ఇలాంటి వైఫల్యాల వల్ల చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎలాంటి విపత్తు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్రమాదాలకు కారణమవుతున్న మేఘా కంపెనీ.. ఇలా పలు కీలకమైన ప్రాజెక్టులను చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది.
సుంకిశాల రిటైనింగ్ వాల్ ప్రమాదం
2024, ఆగస్టు 1న నల్గొండ జిల్లా (Nalgonda District) లోని నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ప్రాజెక్టు కాంట్రక్టర్ మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు, పార్టీల నేతల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. సరైనా నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టారని.. కార్మికులు పనిచేసే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే ఘోర విషాదం జరిగి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేఘా కంపెనీ తమ ఖర్చులని తగ్గించుకునేందుకు ఇలాంటి నాసిరకం పనులు చేయడం వల్లే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని మండిపడుతున్నారు.
Telangana: In Nalgonda district, the Nagarjunasagar Dam’s water levels reached dead storage, causing a significant accident at the Sunkishala project. Officials kept the incident confidential since no workers were on site at the time pic.twitter.com/JWqf6A6MPf
— IANS (@ians_india) August 8, 2024
NH 66 వంతెన వైఫల్యం
2024,మే లో కేరళలోని కాసరగోడ్‌లో జాతీయ రహదారి 66పై నిర్మాణంలో ఉన్న వంతెనపై కాంక్రిట్ బీమ్ జారిపడింది. 2022 అక్టోబర్‌లో ఇదే రహదారిపై వాహనాదారుల అండర్‌పాస్ కూడా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన రెండేళ్లకే ఇలా మరో ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఈ రెండు ప్రాజెక్టులను కూడా మేఘా కంపెనీ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రమాదాలపై జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) మేఘా ఇంజినీరింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, నాసిరకం పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు వీటిని మేఘా కంపెనీయే సొంత ఖర్చులతో నిర్మించాలని చెబుతూ రూ.35 లక్షల జరిమానా కూడా విధించింది.
కాళేశ్వరం పంప్ స్టేషన్ మునగడం
2022 జులైలో.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ చేపట్టిన కాళేశ్వర పంపింగ్ స్టేషన్ నీట మునగడం రాష్టవ్యాప్తంగా సంచలనం రేపింది. మరో విషయం ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదించిన పరిమితుల కంటే నీటి స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్నారం, మేడిగ్గడలో పంపింగ్ స్టేషన్లు నీటమునిగాయి. ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్‌లో ఉన్న మేఘా కంపెనీ వైఫల్యాలే ఇలాంటి ప్రమాదాలకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోంది.
మిషన్ భగీరథ ట్యాంక్ లీక్ కావడం
2020 జులైలో.. నాగర్‌కర్నూల్‌లో మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా మేఘా కంపెనీ నిర్మించిన ఓవర్‌హెడ్ స్టోరేజ్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ట్యాంకు ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సరైన నాణ్యత లేకుండా, నాసీరకం పనులు చేయడం వల్ల ట్యాంకు కూలిపోవడం అప్పట్లో దుమారం రేపింది.
ఫేక్ బ్యాంకు గ్యారెంటీలతో మోసం
భారత ప్రభుత్వానికి చెందిన ఎగ్జిమ్ బ్యాంకు (Exim Bank) నిధులతో మంగోలియా క్రూడ్ ఆయిల్ రిఫైనరీని ప్రాజెక్టును చేపట్టారు. రూ.7 వేల కోట్లతో దీని నిర్మాణం చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం 2024 నాటికే దీన్ని పూర్తి చేయాలి. కానీ మేఘా కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు 14 శాతం మాత్రమే పూర్తయింది. ఫేక్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారెంటీలతో మేఘా కంపెనీ మోసాలకు పాల్పడటం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ ప్రాజెక్టులో కూడా మేఘా కంపెనీ ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను వినియోగించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కువగా జాప్యం జరగడం, పనితీరు సరిగా లేకపోవడం మెఘా కంపెనీ నిర్వహణ సామర్థ్యాలను సూచిస్తున్నాయి. ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే కాదు.. మేఘా చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో కూడా ఇలాంటి జాప్యమే జరుగుతోంది.
సీబీఐ కేసు
ఇలాంటి ఆందోళనల నేపథ్యంలో 2024, ఏప్రిల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI).. మేఘా ఇంజినిరింగ్ అంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL), NMDC లిమిటెడ్, NMDC ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ (NISP) లిమిటెడ్, MECON లిమిటెడ్ కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసు రూ.314.57 కోట్ల ఒప్పందానికి సంబంధించింది. దీంతో మేఘా కంపెనీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
కైగా ప్రాజెక్టు భద్రతపై అనుమానం
కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో మేఘా కంపెనీ అత్యల్ప బిడ్డర్‌గా ఉంది. దీంతో ఈ కంపెనీ ప్రమేయం ఉండటం ఏదైనా ప్రమాదానికి దారితీసే అవకాశాలు గణనీయంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో నాసీరకం పనులు చేసి చేతులు దులుపుకునే అలవాటున్న మేఘా కంపెనీ.. ఇప్పుడు ఇలాంటి పవర్ ప్లాంట్‌లో భాగం కావడం దాని భద్రతపై అనుమానాలు రేకిత్తిస్తుంది. గతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో జరిగిన విపత్తులు ఇప్పుడు మేఘా కంపెనీ వల్ల కూడా జరిగే ప్రమాదం ఉందా అనేది ఆందోళన కలిగిస్తోంది.
Also Read : నెమలి కూర వండి వీడియో అప్లోడ్ చేశాడు.. చివరికి