Matangi Swarnalatha Bhavishyavani: లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణ (Telangana) లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహంకాళి అమ్మవారి బోనాల (Mahankali Bonalu) ఉత్సవాలు ప్రశాంతంగా సాగాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రభుత్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో అమ్మవారి బోనాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
లక్షలాది మంది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణతో మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోతు రాజుల ఆటపాటలతో ఫలహారం బండి ఊరేగుంపులతో సోమవారం తెల్లవారు జామున తొలి రోజు బోనాల సంబరాలు ముగిసాయి. మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ రెండో రోజు కొనసాగుతుంది. వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రంగం భవిష్యవాణి (Rangam Bhavishyavani), ఏనుగు అంబారీ పై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర సోమవారం సాయంత్రం ముగిసింది. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. పాడిపంటలు బాగా పండుతాయని తెలిపారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. భక్తులను చల్లగా కాపాడుకుంటామన్న మాతంగి స్వర్ణలత.. తెలంగాణ ప్రజలను సుభిక్షంగా కాపాడుకుంటామని తెలిపారు. రంగం కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి,మంత్రి పొన్నం పలువురు అధికారులు హాజరయ్యారు. ఏ బోనం అయినా, ఎవరు ఎత్తుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే. వీళ్ళు, వాళ్ళు తేవాలని సందేహం పెట్టుకోకండి. మట్టి బోనం అయినా, స్వర్ణ బోనం అయినా…ఎవరు తెచ్చిన సంతోషంగా అందుకునే బాధ్యత నాది .పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపం నేను పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా.’ అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. స్వర్ణలత గత 25 ఏండ్లుగా భవిష్యవాణి వినిపిస్తున్నారు. అమ్మవారే స్వయంగా ఆమె రూపంలో వచ్చి భవిష్యవాణి వినిపిస్తారని భక్తుల నమ్మకం.
Also Read:Telangana: ఆర్ఆర్ఆర్ వేగవంతం చేయండి-మంత్రి కోమటిరెడ్డి