Invitation To KTR : అమెరికా(America) లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ(North Western University) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్(India Business Conference) కు హాజరు కావాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటిఆర్(Ex. Minister KTR) కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన పాలసీలు, అవి సాధించిన విజయాలను సదస్సులో వివరించి స్ఫూర్తి నింపాలని కేటిఆర్ ను కోరారు.
ఇది కూడా చదవండి : IPL: RCB పేరు మార్పు.. ఈసారైనా అదృష్టం వరించేనా!?
ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాలి..
ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎగ్సిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి(Swetha Medapati) లేఖలో విజ్ఞప్తిచేశారు. అమెరికాలోని ఇవాన్ స్టన్ లో 1908లో నెలకొల్పిన ఈ బిజినెస్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ బిజినెస్ ర్యాంకింగ్ లో రెండో స్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం భారత్ లోని పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, క్షేత్రస్థాయిలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశంపై చర్చించేందుకు ఇండస్ట్రీ లీడర్లను, వ్యాపారవేత్తలను, విధానాల రూపకల్పనలో అనుభవం కలిగిన నాయకులను ఒక్క తాటిపైకి తేవాలనే ఆలోచనతోనే ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు శ్వేత మేడపాటి తెలిపారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ఆమె పేర్కొన్నారు.