జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో 25ఏళ్ల ఆర్మీ జవాను అదృశ్యమయ్యాడు. జవాన్ కిడ్నాప్ కు గురైనట్లుగా తెలుస్తోంది. అతని వాహనం నుంచి కిడ్నాప్ చేశారంటూ అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్మీ, పోలీసులు జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అదృశ్యమైన ఆర్మీ జవాన్ పేరు జావేద్ ఆహ్మద్. కుల్గాం జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన జావేదు..లఢఖ్ లో విధులు నిర్వహిస్తున్నారు. సెలవులపై కుల్గాంలోని తన ఇంటికి వచ్చారు. అయితే జావేద్ శనివారం వ్యక్తిగత పనుల నిమ్మిత్తం ఇంటి నుంచి కారులో చౌల్గాంకు వెళ్లారు.
VIDEO | Security forces launch a search operation for a missing Army soldier in Jammu and Kashmir's Kulgam. pic.twitter.com/fvTyO0PhzS
— Press Trust of India (@PTI_News) July 30, 2023
అయితే సాయంత్రం అయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అతడికోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. పరాన్హాల్ గ్రామంలో జావేద్ కారును గుర్తించారు. కారులో ఒక జత చెప్పులు, రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పరాన్హాల్ గ్రామానికి చేరుకున్న పోలీసులు వాహానాన్ని అన్ లాక్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్మీకూడా సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.