లోక్ సభ శుక్రవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు ఉద్దేశించిన కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు సవరణల బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ పై సభలో రచ్చ జరుగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు.
సభలో గందరగోళం మధ్య సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్( సవరణ) బిల్లు – 2023, ఇంటి గ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) బి్ల్లు -2023 లను సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. రాష్ట్ర జీఎస్టీ చట్టాల్లో చేసిన సవరణలను రాష్ట్రాలు ఆయా అసెంబ్లీల్లో చర్చించి ఆమోదం తెలుపనున్నాయి.
ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాల సరఫరాపై పన్ను విధించడంపై స్పష్టత ఇచ్చేందుకు సీజీఎస్టీ చట్టం- 2017లోని షెడ్యూల్-3లో కొత్త నిబంధనను పొందు పరిచేందుకు ఈ సవరణ బిల్లును తీసుకు వచ్చారు. ఇక ఆన్ లైన్ గేమింగ్ సంస్థలపై జీఎస్టీ విధించేందుకు కొత్త నిబంధనను చేర్చేందుకు గాను ఐజీఎస్టీలో సవరణలను కేంద్రం తీసుకు వచ్చింది.
రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను నిరోధించేందుకు కూడా ఈ సవరణల ద్వారా ప్రభుత్వానికి అధికారాన్ని అందజేశారు. ఇక కేంద్ర జీఎస్టీ(CGST), ఇంటిగ్రేటెడ్(IGST) చట్టాలకు సవరణలను గతవారం జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.