ఇండియన్ షూటర్ల మీద బోలెడు అంచనాలున్నాయి మొదటి నుంచి. అవి ఏమాత్రం వమ్ము చేయకుండా తమ ప్రతిభను నిలబెట్టుకుంటున్నారు భారత షూటర్లు. నిన్న కొల్లగొట్టిన పతకాలు కాక ఈరోజు 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో స్వప్నిల్ తో కూడిన టీమ్ ఇండియా మెన్ గోల్డ్ ను దక్కించుకున్నారు. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్లో రజతాన్ని తమ ఖాతాలోకి వేసుకున్నారు. అలాగే వుమెన్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత మహిళా షూటర్ పాలక్ గోల్డ్ గెలుచుకోగా, ఈషా సింగ్ సిల్వర్‌ను సొంతం చేసుకుంది. నిన్న కూడా టీమ్ ఇండియా షూటర్లు స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. ఇక వుషూలో రజతం, ఈక్వెస్ట్రియన్ లో కాంస్యం కూడా సొంతం చేసుకున్నారు భారత క్రీడాకారులు.
ఆసియా క్రీడల్లో షూటర్ల హవా కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో టీమ్ ఇండియా మెన్ జట్టు 1734 పాయింట్ల అగ్రస్థానంతో చైనాను ఓడించి పసిడిని అందుకుంది. సరబ్జోత్ సింగ్ 580 పాయింట్లు, అర్జున్ సింగ్ చీమా 578 పాయింట్లు, శివ నర్వాల్ 576 పాయింట్లతో ప్రతిభను చాటుకున్నారు. ఆసియా క్రీడల్లో భారత్ కు ఇది నాలుగో స్వర్ణం. మరోవైపు సరబ్, అర్జున్ 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు చేరినప్పటికీ పతకాలు మాత్రం గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో భారత షూటర్లు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలు సాధించారు.
వుషులో రోషిబినా దేవి రజతంతో సరిపెట్టుకుంది. మహిళల 60 కేజీల శాండా ఈవెంట్లో చైనా ప్రత్యర్ధి జియావోయ్ చేతిలో పరాజయం పాలైంది. రోషిబినా వరుసగా రెండో సారి ఆసియా క్రీడల్లో పతకాన్ని సాధించింది. ఆమె ఈ పతకాన్ని మణిపూర్ అల్లర్ల బాధితులకు అంకితం చేసింది. ఈక్వేస్ట్రియాన్ లో మాత్రం ఇండియాకు ఊహించని విధంగా మరో పతకం వచ్చింది. వ్యక్తిగత విభాగంలో అనూష్ అగర్వాల్ కాంస్యాన్ని సాధిస్తే…టీమ్ ఈవెంట్లో ఏకంగా స్వర్ణాన్ని సాధించారు.ఆసియా క్రీడల్లో డ్రెస్సాజ్ విభాగంలో భారత్ కు పతకం రావడం ఇదే మొదటిసారి.
ఇక భారత పురుషుల హాకీ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. అలాగే మహిళల బ్యాడ్మింటిన్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ కు చేరింది. పీవీ సింధు, అషిమత్, అనుపమ తమ సింగిల్స్ మ్యాచ్ లలో విజయం సాధించారు. మరోవైపు స్క్వాష్ పురుషులు, మహిళల జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. దీంతో రెండు జట్లకు పతకాలు ఖాయం అయ్యాయి. అలాగే భారత్ బాక్సర్లు నిశాంత దేవ్, జాస్మిన్ లంబోరియా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళారు. ఇక ఆసియా క్రీడల్లో టెన్నిస్ ఈవెంట్ లో భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకుంది.