Hajj: ఈ ఏడాది హజ్ యాత్రలో మృతుల సంఖ్య 1,300 దాటినట్లు సౌదీ అధికార వర్గాలు ప్రకటించాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్లే ఈ మరణాలు సంభవించినట్లు తెలిపారు. చనిపోయిన వారికి సంప్రదాయం ప్రకారం మక్కాలో అంత్యక్రియలు నిర్వహించామని సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్దురహ్మాన్ అల్ జలజిల్ చెప్పారు. కొంతమంది భక్తులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం కష్టంగా మారిందని మీడియాతో అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న యాత్రికులు కోలుకుంటున్నట్లు చెప్పారు.
హజ్ యాత్రికుల మరణాలతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి!
ఈసారి సౌదీ అరేబియాలో ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు మరణించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎండ వేడిమి కారణంగా 2700 మందికి పైగా యాత్రికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారాన్ని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. వీరిలో మరణించినవారిలో అత్యధికంగా 323 మంది ఈజిప్టు పౌరులు. ఈజిప్టు యాత్రికులందరూ వేడి కారణంగా మరణించారని సౌదీ అరేబియా ప్రభుత్వం పేర్కొంది.
గతంలో తొక్కిసలాట జరగడం వలన ఇంత స్థాయిలో మరణాలు సంభంవించిన సంఘటనలు జరిగాయి. ఇక వేడి కారణంగా భారతదేశం నుండి మొత్తం 68 మంది, జోర్డాన్ నుండి 60 మంది హజ్ యాత్రికులు మరణించారు. ఎండ వేడిమి ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం 1.8 మిలియన్ల మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొన్నారు, అందులో 1.6 మిలియన్లు విదేశీయులు. సౌదీ అరేబియా ప్రభుత్వం గొడుగులను ఉపయోగించాలని, ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచించినప్పటికీ, పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది.