గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముంబై తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రాపర్టీస్ ను అమ్మేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు కొంతకాలంగా ఇండియన్ మూవీస్ లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపించట్లేదని, ఇక్కడికి రావాడానికి పెద్దగా ఇష్టపడట్లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఒకప్పుడు బీ టౌన్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపూఊపేసిన ప్రియాంక హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత లాస్ఏంజిల్స్కు మకాం మార్చిన నటి హాలీవుడ్లో సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఇటీవలే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన టెలివిజన్ సిరీస్ ‘సిటాడెల్’లోనూ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అలరించిన నటి.. ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా హాలీవుడ్ సినిమాలు, వెబ్సిరీస్లకే ప్రాధాన్యతనిస్తున్న ప్రియాంక.. మరికొన్ని రోజుల్లో హిందీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చనడుస్తోంది. అంతేకాదు ఈ వార్తలకు బలం చేకూర్చేలా ముంబైలోని తన ఆస్తులను వరుసగా అమ్మకానికి పెడుతుందని, తాను ఎంతో ఇష్టపడి డిజైన్ చేసుకున్న ఆంధేరిలోని ఖరీదైన ప్లాట్‌ను కూడా ఇటీవలే పదికోట్లకు అమ్మేసినట్లు సమాచారం. అలాగే ఓ కమర్షియల్ ప్రాపర్టీని కూడా అమ్మకానికి పెట్టిందని, మరికొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్న చిన్నచితకా ప్రాపర్టీలన్నీ విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితుల సమాచారం.
Also read: భారత్ గెలిస్తే బట్టలు లేకుండా పరిగెత్తుతా.. ప్రముఖ నటి సంచలన ప్రకటన
ఇక ఈ ప్రాపర్టీస్ అమ్మకం విషయం చర్చనీయాంశమవగా.. ప్రియాంక చోప్రా హిందీ చిత్రసీమకు దూరం కాబోతున్నదనే ప్రచారం మొదలైంది. హాలీవుడ్లో వరుసగా భారీ ఆఫర్స్ రావడంతోపాటు హిందీ మూవీస్ లో అంతగా అవకాశాలు లేకపోవడంతో లాస్ఏంజిల్స్ కేంద్రంగానే కెరీర్‌ను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రియాంక, ఆమె భర్త నిక్ కూడా దీనిపై ఇంకా స్పందించలేదు. కానీ ఈ విషయం తెలిసిన ప్రియాంక ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తమ అభిమాన నటి దూరం అవుతుందని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవద్దని కోరుతున్నారు.