Dhaka : బంగ్లాదేశ్ (Bangladesh) లో రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా (Air India) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆ దేశ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో వివరించింది. షెడ్యూల్ ప్రకారం భారత్ నుంచి ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి భారత్కు రావాల్సిన విమానాలను (Flights) రద్దు చేసినట్లు పేర్కొంది.
బంగ్లాదేశ్లో పరిస్థితిని తాము నిరంతరం పర్యవేక్షిస్తామని, ఇప్పటికే ఇండియా నుంచి ఢాకాకు, ఢాకా నుంచి ఇండియాకు విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తమ టికెట్లను రీషెడ్యూల్ చేసుకున్నా, రద్దు చేసుకున్నా చార్జీల నుంచి పూర్తి మినహాయింపును ఇస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ‘మా అతిథులు, సిబ్బంది సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యం’ అని ఎయిర్ ఇండియా తెలిపింది.