మూడు విడుతల్లో రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మీడియాతో మాట్సాడారు. ‘ రుణమాఫీ హామీ అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపాం. రూపాయి, రూపాయి పోగుచేసి కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యం. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు కూడా రుణమాఫీ అందిస్తాం. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కొద్దికాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం.
Also Read: తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు
లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ ఆగస్టులోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెబితే అందరూ ఆశ్చర్యపోయారు. ఓట్ల కోసమే సవాల్ చేశారంటూ ఆరోపించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నామని’ భట్టి విక్రమార్క అన్నారు. మూడు దశల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్.. రేపు సాయంత్రం 4 గంటల వరకు రూ.లక్షలోపు రుణాలకు మాఫీ జరుగుతుందని తెలిపారు. రూ. 7 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు.