దేశంలోని నకిలీ వర్సిటీల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 20 ఫేక్ వర్సిటీలు వున్నట్టు ప్రకటనలో వెల్లడించింది. డిగ్రీ సర్టిఫికెట్లు ప్రధానం చేసేందుకు ఆయా వర్సిటీలకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది. ఆయా వర్సిటీలు ప్రధానం చేసే డిగ్రీలకు గుర్తింపు లేదని తెలిపింది. అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా వుండాలని సూచించింది.
ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 8 ఫేక్ వర్సిటీలు వున్నట్టు చెప్పింది. యూజీసీ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పలు సంస్థలు డిగ్రీ పట్టాలను ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి తెలిపారు. సదరు వర్సిటీల జారీ చేసే డిగ్రీ సర్టిఫికెట్లు చెల్లుబాటుకావన్నారు. ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగాల్లో ఆ డిగ్రీ సర్టిఫికెట్లకు గుర్తింపు ఇవ్వబోమన్నారు.
ఆ వర్సిటీలకు చట్ట ప్రకారం డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదన్నారు. ఫేక్ వర్సిటీల జాబితాలో…. ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూని వర్శిటీ, దార్యాగంజ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, వొకేషన్ యూనివర్శిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జురీడికల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయాలు వున్నాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లోని నాలుగు ఫేక్ వర్సిటీలు వున్నట్టు చెప్పింది. అందులో గాంధీ హిందూ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్శిటీ, భారతీయ శిక్షా పరిషద్ వున్నాయన్నారు. వాటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళల్లోనూ ఫేక్ వర్శిటీలు వున్నాయని వివరించారు.