JNTU: వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈవెనింగ్ బీటెక్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అయ్యింది. ఈ విద్యా సంవత్సరం లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి మార్గదర్శకాల మేరకు ఈవెనింగ్ బీటెక్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా జేఎన్టీయూ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ విద్యా సంవత్సరంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఒక్కో బ్రాంచ్‌కు 30 సీట్ల చొప్పున 90 మందికి అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. పార్ట్‌టైమ్ బీటెక్‌లో ప్రవేశం కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కనీసం ఏడాది పనిచేసి ఉండాలి.
మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొనసాగిస్తూనే రెగ్యులర్ బీటెక్ మాదిరి పార్ట్‌టైమ్ బీటెక్‌లో చేరి కనీసం మూడేళ్లలో పూర్తి చేసుకోవచ్చు.
Also read: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విడుదల!