Bangalore Dog Meat Case: మూడు రోజుల క్రితం బెంగళూరులో కుక్కమాంసం రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై పెద్ద కలకలం రేగింది. రాజకీయంగా ఇది పెను దుమారానికి కారణమైంది. జైపూర్ నుంచి రైలులో వచ్చిన 2,700 కిలోల మాంసంతో కూడిన 90 ఇన్సులేట్ బాక్సులను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కుక్క మాంసాన్ని తరలిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం సాయంత్రం రైట్ వింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో స్టేషన్, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది . సుదూర రాష్ట్రాల నుంచి పార్శిళ్లను తెచ్చుకుని బెంగళూరులో కుక్క మాంసం అక్రమంగా విక్రయిస్తున్నారని రైట్‌వింగ్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు. ఈ ఘటనపై
Bangalore Dog Meat Case: పోలీసులు శుక్రవారం రాత్రి మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొదటి ఎఫ్ఐఆర్ మాంసం రవాణాకు వ్యతిరేకంగా, కుక్క మాంసంతో కలిపి ఉండొచ్చని అనుమానిస్తూ, రెండవది ఆహార నాణ్యత విభాగం అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు గోసంరక్షకుడు పునీత్ కెరెహళ్లిపై. మరో ఎఫ్ఐఆర్ పునీత్, అతని నలుగురి సహచరులపై నమోదైంది. బహిరంగ ప్రదేశంలో చట్టవిరుద్ధంగా రాత్రిసమయంలో సమావేశం అయ్యారని చెబుతూ మూడో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు మీడియాకు పొలిసు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, అనుమానాస్పద మాసం సాంపిల్స్ ను పరీక్షల కోసం పంపించినట్టు తెలిపారు.
ట్విస్ట్ ఇదే..
Bangalore Dog Meat Case: అయితే, అది కుక్క మాంసం కాదనీ, మేక మాంసం అనీ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. బెంగళూరులో కుక్క మాంసం విక్రయించడం లేదని, పార్శిల్లో వచ్చినది ‘చెవోన్’ అని ఆహార భద్రత కమిషనర్ కె శ్రీనివాస్ మీడియాకు స్పష్టం చేశారు. “ఈ మాంసం కుక్కది కాదు, సిరోహి అనే మేక జాతికి చెందినది, ఇది రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్-భుజ్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వాటికి కొద్దిగా పొడుగైన తోక.. అదేవిధంగా మచ్చలు కూడా ఉన్నాయి. అందువల్ల, దీనిని కుక్కలని అందరూ భ్రమపడతారు. గందరగోళ పడతారు. అయితే, మటన్, ‘చెవాన్’ తక్కువ సరఫరా కారణంగా, కొంతమంది వ్యాపారులు దానిని ఇతర రాష్ట్రాల నుండి సేకరించి ఇక్కడ సరసమైన ధరకు విక్రయిస్తారు.” అంటూ ఆయన స్పష్టం చేశారు.
ఇక్కడే బోలెడు గొర్రెలు.. అక్కడి నుంచి ఎందుకు?
Bangalore Dog Meat Case: మాంసం పార్సిల్స్ పై వచ్చిన ఈ రిపోర్ట్ తరువాత బెంగళూరులో చాలామంది ప్రజలు కర్ణాటకలో గొర్రెలు, మేకల లభ్యత ఎక్కువగా ఉండగా ఏ వ్యాపారి అయినా ఇంత భారీ మొత్తంలో ‘చెవాన్’ను బెంగళూరుకు ఎందుకు తీసుకువస్తారనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎక్కడో తేడా జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారుల వాదన మరోరకంగా ఉంది. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (GKVK)లోని జంతు శాస్త్రాల విభాగం నిపుణులు బెంగళూరులో ‘చెవాన్’ తీవ్రమైన కొరత ఉందని వెల్లడించారు.
ఏదిఏమైనా ఇది మేక మాంసం అని చెప్పినప్పటికీ కర్ణాటకలో రాజకీయ గందరగోళం చెలరేగుతూనే ఉంది. బీజేపీ ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ ఆరోపణలు చేస్తూవస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా బీజేపీకి కౌంటర్ ఇస్తూ వస్తోంది.