Bail Order : మద్యం తాగి అతి వేగంతో కారు (Drunk & Drive) నడిపి ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్న మైనర్ బాలుడికి కోర్టు బెయిల్ (Court Bail) ఇవ్వడమే కాకుండా ఓ విచిత్రమైన శిక్ష కూడా విధించింది. కేవలం 15 గంటల్లోనే బెయిల్ మంజూరు చేసి..శిక్షగా కేవలం 300 పదాల వ్యాసం రాయాలని , కొన్నాళ్లపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని తీర్పునిచ్చింది. ఈ వినూత్న తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్రకు (Maharashtra) చెందిన బ్రహ్మ రియాల్టీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ (17). మద్యం తాగి తన లగ్జరీ కారు పోర్షే కారులో పుణెలో బీభత్సం సృష్టించాడు. మద్యంమత్తులో కారును అతివేగంగా నడిపాడు. ఈ క్రమంలో పూణే – కళ్యాణి నగర్లో కారు అదుపు తప్పి వాహనదారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు పది మంది గాయపడ్డారు.. చికిత్స పొందుతూ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందారు.
ఈ ప్రమాదంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి అత్యంత ఖరీదైన కారును ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు వేదాంత్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ చేసి 15 గంటలు కాకముందే వేదాంత్‌కు బెయిల్ వచ్చేసింది. మైనర్ కావడంతో జువైనల్ బోర్డులో వేదాంత్‌ను ప్రవేశ పెట్టాగా అతడిని చిన్నపిల్లాడిగా భావించిన బోర్డు వేదాంత్‌కు స్వల్ప శిక్షలు విధించింది. ఇద్దరి మృతికి కారణమైనా కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేశారు.
అనంతరం చేసిన ప్రమాదంపై 300 పదాల వ్యాసం రాయాలని ఆదేశించింది. దాంతోపాటు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో (Traffic Police) కలిసి పని చేయాలని తీర్పునిచ్చింది. అనంతరం మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని సూచించింది. భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సహాయం చేయాలని న్యాయస్థానం బాలుడి రూపంలో ఉన్న నిందితుడికి ఆదేశించింది. అయితే ఇద్దరి మృతికి కారణమైన అతడిని దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే వారి విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.
నిందితులకు కమిషనర్ సహాయం: సంజయ్ రౌత్
ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ నాయకుడు సంజయ్ రౌత్ కూడా మహారాష్ట్ర పోలీసులపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అజిత్ పవార్ గ్రూపుకు చెందిన ఎమ్మెల్యే కూడా తనకు సహాయం చేశారని ఆరోపించారు. పోలీసు కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను రక్షించేందుకు కమిషనర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. నిందితుడు మద్యం సేవించినట్లు వీడియోలో ఉందన్నారు. కానీ అతని వైద్య నివేదిక అందుకు తగినట్లుగా లేదని ఫైర్ అయ్యారు. పోలీస్ కమిషనర్ తొలగించకుంటే పూణే ప్రజలు రోడ్ల మీదికి వస్తారని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఆగ్రహం
భారతదేశంలో సంపన్నులకు ఎలాంటి నిబంధనలు లేవని సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు అధికారికం అయ్యిందని.. కానీ అలా చేసే వారి నాన్న చాలా ధనవంతుడై ఉండాలనేది ఒక్కటే షరతు అంటూ సెటైర్లు వేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ హత్య చేస్తే కేవలం ఒక వ్యాసం రాస్తే సరిపోతుందా? అంటూ ప్రశిస్తున్నారు. జువైనల్ బోర్డు ఆదేశాలను కూడా నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. వ్యాసం ఎలా రాయాలో తెలిస్తే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చా? అనే ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో పాటు నిందితులు నడుపుతున్న లగ్జరీ కారు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ కూడా వినిపిస్తోంది.