EMI’s : నేటి స్కూళ్ళు, విద్యవిధానాలు తల్లిదండ్రులకు(Parents) చుక్కలు చూపిస్తున్నాయి. విపరీతమైన పోటీ.. ఆకాశాన్నంటే ఫీజులతో కార్పొరేట్ స్కూళ్ళ దందా నడుస్తోంది. తమ పిల్లలకు మంచి చదువు కావాలనే ఉద్దేశంతో వీటిని వదలలేకపోతున్నారు పేరెంట్స్. దాన్ని తమ ఆయుధాలుగా మల్చుకుంటున్నాయి కార్పోరేట్ స్కూళ్ళు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెడుతూ వామ్మో అనిపిస్తున్నాయి. కోవిడ్ తర్వాత దాదాపు అన్ని కార్పొరేట్ స్కూళ్ళూ(Corporate Schools) ఫీజులను విపరీతంగా పెంచేశాయి. వాటిని కట్టలేక లబోదిబోమని తల్లిదండ్రులు ఏడుస్తుంటే వారిని ఓదార్చినట్టే ఓదార్చి మరో కొత్త భస్మాసుర హస్తాన్ని పెడుతున్నాయి.
Also read:విశ్వగురు మోదీ..పదేళ్ళల్లో 14 దేశాల జాతీయ అవార్డులు..
మీ పిల్లలు స్కూలు ఫీజు ఎక్కువా…కట్టలేక మీరు ఇబ్బంది పడుతున్నారా…అయితే ఇదిగో ఇలా కట్టేయండి అంటూ కొత్త స్కీముతో ముందుకు వస్తున్నాయి కార్పొరేట్ బడులు. ఫీజుల బాధ లేకుండా మధ్యేమార్గాన్ని కనిపెట్టాయి. గ్రేక్వెస్ట్ లాంటి సంస్థలతో చేతులు కలుపుతున్నాయి. స్కూళ్ళకు ఈ సంస్థలకూ సంబంధమేంటా అని ఆలోచిస్తున్నారా..ఏమీ లేదు. ముందుగా మన పిల్లల స్కూల్ ఫీజులు గ్రేక్వెస్ట్ లాంటి సంస్థులు కట్టేస్తాయి. ఆ తరువాత వారికి తీరిగ్గా ఈఎంఐ రూపంలో కట్టేయొచ్చు. అయితే ఈ ఫైనాన్స్ సంస్థలకు వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుగాని కట్టాల్సిన అవసరంలేదు. ఫైనాన్స్ సంస్థలను కూడా స్కూల్ యాజమాన్యాలే వెతికి పెడుతాయి. కార్పొరేట్ స్కూళ్లు లక్షన్నర నుంచి రూ.7 లక్షల వరకు ఫీజులు ఉండడంతో ఈపద్దతిని ప్రవేశపెట్టామని చెబుతున్నాయి కార్పొరేట్ స్కూళ్ళు.
ఈ స్కీములో భాగంగా విద్యార్థి ఫీజు రూ.2 లక్షలు ఉంటే… ఆ మొత్తాన్ని ఫైనాన్స్ సంస్థ ముందు చెల్లించేస్తుంది. తరువాత ఆ మొత్తాన్ని తల్లిదండ్రులు రూ.20 వేల చొప్పున 10 సార్లు ఫైనాన్స్ సంస్థకు కట్టేయాలి. దీంతో పాటూ ఉచితంగా విద్యార్థి తల్లిదండ్రులకు రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ను కూడా ఇస్తుంది. అయితే ఈ స్కీమ్ మీద తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాభమూ లేకుండా ఫైనాన్స్ సంస్థలు ఎందుకు ఈపని చేస్తాయి. అసలు స్కూళ్ళు ఎందుకు దీన్ని ప్రవేశపెడతాయి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇదో కొత్త దందా అంటూ కొట్టిపడేస్తున్నారు.