టొరాంటో వేదికగా జరుగుతున్న 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ సమరం రసపట్టుగా సాగుతోంది. పురుషుల, మహిళల విభాగాలలో ప్రపంచ మేటి 8 మంది గ్రాండ్‌మాస్టర్ల నడుమ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో 14 రౌండ్ల పోరుగా ఈ టోర్నీని అంతర్జాతీయ చెస్ సమాఖ్య నిర్వహిస్తోంది. 14 రౌండ్లలో అత్యధిక పాయింట్లు సాధించిన గ్రాండ్‌మాస్టర్ మాత్రమే చాలెంజర్ కమ్ క్యాండిడేట్స్ టైటిల్ దక్కించుకోగలుగుతాడు. క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడికి మాత్రమే ..2025 ప్రపంచ చెస్ టైటిల్ పోరులో చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో తలపడే అవకాశం ఉంటుంది.
టైటిల్ రేస్ లో ఒకే ఒక్కడు..మూడువారాల ఈ పోరులో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మొదటి 12 రౌండ్ల పోరులో ఆధిక్యత చేతులు మారుతూ వచ్చింది. భారత్ తరపున బరిలో నిలిచిన ముగ్గురు యువగ్రాండ్ మాస్టర్లలో విదిత్ గుజరాతీ, ప్రజ్ఞానంద్ గత రెండురౌండ్లలో పేలవమైన ఆటతీరుతో టైటిల్ రేస్ కు దూరమయ్యారు. అయితే..17 సంవత్సరాల కుర్ర గ్రాండ్ మాస్టర్ గుకేశ్ మాత్రమే మరో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు హికారు నకామురా, ఇయాన్ నెపోమినిచ్ లతో కలసి 7.5 పాయింట్లు చొప్పున సాధించడం ద్వారా సంయుక్త అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
చివరి రెండుగేమ్ ల్లోనూ గుకేశ్ విజయాలు సాధించగలిగితే క్యాండిడేట్స్ టోర్నీ విన్నర్ గా నిలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీలో తలపడుతున్న భారత కుర్రాళ్లలో గుకేశ్ వయసు 17, ప్రజ్ఞానంద్ వయసు 18 సంవత్సరాలు మాత్రమే. విదిత్ గుజరాతీ మాత్రమే 29 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఈ ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు తమ కెరియర్ లో తొలిసారిగా క్యాండిడేట్స్ టోర్నీ బరిలో నిలువగా..వారి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సీనియర్ గ్రాండ్ మాస్టర్లు ఇయాన్ నెపోమినిచ్, నకామురా, కరూనాలకు మాత్రం అపారఅనుభవమే ఉంది. అమెరికన్ గ్రాండ్ మాస్టర్ల జోడీ ఫేబియన్ కరూనా వయసు 31, హికారు నకామురా వయసు 33 కాగా..రష్యన్ గ్రాండ్ మాస్టర్ నెపోమినిచ్ వయసు 36 సంవత్సరాలు. ఈ ముగ్గురితో పోల్చిచూస్తే వయసులో కానీ, అనుభవంలో కానీ ఎంతో దిగువన ఉన్న భారత యువగ్రాండ్ మాస్టర్ల త్రయం అంచనాలకు మించి రాణించడం ద్వారా సత్తా చాటుకోగలిగారు. అనుభవం లేమితో 11, 12 రౌండ్ల పోరులో ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీ విఫలమై టైటిల్ రేస్ కు దూరం కాగా..గుకేశ్ మాత్రం సర్వశక్తులూ కూడదీసుకొని మరీ ఆడుతూ తన పోరాటం కొనసాగిస్తున్నాడు.
నిజత్ అబ్సోవ్ పై కీలక గెలుపు.. 10వ రౌండ్ వరకూ సంయుక్త అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన గుకేశ్ 11వ రౌండ్ ఓటమితో రెండోస్థానానికి పడిపోయినా…కీలక 12వ రౌండ్ లో అజర్ బెజాన్ గ్రాండ్ మాస్టర్ నిజత్ అబ్సోవ్ పై విజయం సాధించడం ద్వారా మరోసారి సంయుక్త అగ్రస్తానానికి చేరుకోగలిగాడు. 13వ రౌండ్ లో ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరోజాతో గుకేశ్ తలపడటం ద్వారా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మరో 12వ రౌండ్ పోరులో అలీరెజాను నకామురా ఓడించడం ద్వారా వరుసగా మూడో గెలుపుతో పుంజుకోగలిగాడు. ఇయాన్ నెపోమినిచ్ తో జరిగిన 12వ రౌండ్ పోరును ప్రజ్ఞానంద్ డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. టాప్ సీడ్ ఫేబియానో కరూనా 7 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ 6 పాయింట్లతో ఐదు, విదిత్ గుజరాత్ 5.5 పాయింట్లతో 6 స్థానాలలో కొనసాగుతుంటే..అలీరెజా 4.5 పాయింట్లతో లీగ్ టేబుల్ ఆఖరిస్థానానికి పడిపోయాడు.
వైశాలీ విజయం, హంపీ గేమ్ డ్రా..మహిళల విభాగంలో యువ గ్రాండ్ మాస్టర్ వైశాలీ 12వ రౌండ్లో విజయం సాధించగా..,సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. చైనా గ్రాండ్ మాస్టర్ జాంగ్యా టాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అలెగ్జాండ్రా గోర్యచికినాతో జరిగిన 12వ రౌండ్ పోరును కోనేరు హంపి డ్రాగా ముగించింది. ఉక్రెయిన్ ప్లేయర్ అన్నా ముజిచుక్ తో జరిగిన పోరులో వైశాలీ విజేతగా నిలిచింది. ప్రస్తుత టో్ర్నీలో వైశాలీకి ఇది రెండో గెలుపు మాత్రమే. 5.5 పాయింట్లతో 8 మంది గ్రాండ్ మాస్టర్ల లీగ్ టేబుల్ లో వైశాలీ 6వ స్థానం సంపాదించింది. 14 రౌండ్ల ఈ టోర్నీ చివరి రెండుగేమ్ ల్లో విజయం సాధించిన గ్రాండ్మాస్టర్లకే టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.