CM Revanth Reddy : అసెంబ్లీలో చివరి రోజు కులగణన తీర్మానంపై చర్చ జరిగింది. అసెంబ్లీ(Assembly) లో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కులగణన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అనంతరం దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంచి కార్యక్రమం చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టారని.. ప్రజలకు కొన్ని అనుమానాలు వచ్చే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.
కులగణనపై అనుమానాలొద్దు..
చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకే కులగణన చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్(Congress) జస్టిస్ కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అప్పుడు ఆ సర్వేను వాడుకుందని విమర్శించారు. తమకు రాజకీయ దురుద్దేశాలు లేవని అన్నారు. కులగణనపై అనుమానాలొద్దని వ్యాఖ్యానించారు.
డోర్ టూ డోర్ సర్వే…
రాజకీయ, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధికే తమ ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపడుతుందని చెప్పారు సీఎం రేవంత్. త్వరలో డోర్ టూ డోర్ సర్వేనిర్వహించి కులగణన కార్యక్రమం చేపడుతామని తేల్చి చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కులగణన తీర్మానం పై అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు సీఎం. తీర్మానం పై ఏదైనా లీగల్ చిక్కుల పై అంశాలు ప్రతిపక్షాలకు తెలుస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలని కోరారు.
Also Read : కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్.. కారణం అదేనా..
వాళ్లకు బాధ ఉంటుంది..
కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుందని అన్నారు సీఎం రేవంత్. కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. కడియంను తప్పుదోవ పట్టించే వాళ్ళను బయటకు పంపాల్సిందే లేదంటే గాలి సోకుతుందని చురకలు అంటించారు. ఆనాడు రిజర్వేషన్లు అయితేనే ఆయా సామాజిక నేతలు చట్ట సభల్లోకి వస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలపై ఓరోజు చర్చ పెడదాం అని బీఆర్ఎస్ నేతలకు సలహా ఇచ్చారు సీఎం. 2014, 2018, 2023లో పార్టీల మ్యానిఫెస్టో లపై ప్రత్యేకంగా చర్చిద్దాం అని అన్నారు. “ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే మంత్రివర్గ ఆమోదంతో సభలో తీర్మానం పెడుతున్నాం. ఈ పదేళ్లు మీరేం చేశారు.. ఈ 60 రోజుల్లో మీరు ఏం చేశారన్నది చర్చిద్దాం” అని సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
బాధితులను.. పాలకులుగా..
ఈ తీర్మానం.. బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే తమ ఉద్దేశం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). బాధితులుగా ఉన్నవాళ్లను పాలకులుగా చేయాలన్నదే తమ పార్టీ ఆలోచన అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని అన్నారు. అన్ని కులాలు అభివృద్ధిలోకి రావాలనే సంకల్పంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోందని అన్నారు.
Also Read : Cricket:500 వికెట్ల క్లబ్లో ఆర్. అశ్విన్