వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు కన్నతల్లిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో తల్లిని చంపిన నిందితుడు ఆ తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఖాసింపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అంజలమ్మ అనే మహిళకు (45) ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు సతీష్, చిన్న కొడుకు వెంకటేష్. వీరిద్దరికీ వివాహాలు కూడా అయ్యాయి. చిన్నకొడుకు వెంకటేష్ అదే ఊరికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఒక సొంత ఇంటిని వెంకటేష్ నిర్మించుకున్నాడు. మొదట తాండూర్లోని ఓ టిఫిన్ సెంటర్లో వెంకటేష్ పని చేసేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి పని చేసుకుంటూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే.. తల్లి అంజలమ్మ ఖాసింపూర్‌లోనే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది.
కాగా.. వెంకటేష్ తన ఇంటి నిర్మాణం కోసం గ్రామంలో పలువురి దగ్గర అప్పులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో తల్లి అంజలమ్మను నిలదీశారు. దీంతో.. దసరా పండుగకు తన కుమారుడు ఇంటికి వస్తాడని.. వచ్చాక అతడినే డబ్బులు అడగండని వారికి చెప్పింది. డబ్బుల విషయం తనకేమీ తెలియదని చెప్పింది. ఆమె సమాధానంతో అప్పులు ఇచ్చిన వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇక.. దసరా పండుగకు వెంకటేష్ స్వగ్రామానికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఇంటికి వెళ్లి వెంకటేష్‌ను నిలదీశారు. దీంతో అవమానంగా భావించిన వెంకటేష్ తాను ఇంటికి వచ్చిన విషయం తల్లే వారికి చెప్పిందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ మద్యం మత్తులో తల్లిని గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి వాగులో పడేశాడు వెంకటేష్.
తల్లి అంజలమ్మ కనిపించడం లేదంటూ పెద్ద కొడుకు సతీష్ ఆందోళన చెంది.. వెంకటేష్‌ను గట్టిగా నిలదీయగా.. నిజం బయటపడింది. దీంతో తమ్ముడు వెంకటేష్‌పై అన్న సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక చెరువులో అంజలమ్మ మృతదేహాన్ని వెలికి తీసి అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాదాల నుంచి వచ్చే వాసన పోవడానికి సింపుల్ చిట్కా.. ఆ ఆకులతో ఇలా చేస్తే చాలు