మొన్న మేడిగడ్డ…నిన్న అన్నారం…అసలు తెలంగాణ ప్రాజెక్టులకు ఏమవుతోంది. ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇది తెలుసుకునే పనిలోనే ఉన్నారు డ్యాం సేఫ్టీ అధికారులు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో నాణ్యతా లోపం బయటపడింది. ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీలోని రెండు గేట్ల వద్ద జరిగిన లీకేజీతో నీరు ఉబికి వస్తోంది. బ్యారేజీలో 38 నుంచి 40 పిల్లర్ల మధ్య ప్రాజెక్టుకు బుంగ ఏర్పడినట్లు తెలిసింది. వరద నీరు విడుదలయ్యే ప్రదేశంలో అడుగు నుండి నీరు పైకి ఉబికి వస్తోంది. రెండు రోజుల క్రితం బ్లాక్ బి-4 లోని 38, 42 పిల్లర్ల దగ్గర వెంట్ ప్రదేశాల్లో సీపేజ్లున్నాయని…రెండు రోజుల క్రితం అవి మొదలయ్యాయని అధికారులు చెబుతున్నారు.
Also Read:కోపమెక్కువా…అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే..
సీపేజ్ వచ్చిన ప్రాంతాల్లో అవి ఎక్కువ అవకుండా ముందు జాగ్రత్త చర్యగా రింగ్ బండ్ వేస్తున్నామని చెప్పారు డ్యాం సేఫ్టీ అధికారులు. రెండు చోట్లా మూడు అంగుళాల వరకు సీపేజ్లు ఉన్నాయి. అయితే అక్కడ ఇసుక తేలకపోవడంతో ఇది పెద్ద ప్రమాదం కాదని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇసుక, మెటల్ సంచులు, రాళ్ళతో అడ్డు కట్ట వేస్తున్నామని తెలిపారు. అయితే ఇది పైపింగ్ ప్రారంభ దశ అని చెబుతున్నారు. ఇప్పుడే దీనికి చర్యలు తీసుకోకపోతే ఇసుక తరలివెళ్ళిపోతుందని హెచ్చరిస్తున్నారు సీనియర్ ఇంజనీర్లు. మేడిగడ్డలో దీనిని గుర్తించకపోవడం వల్లనే పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. రెండేళ్ళ క్రితమే ఈ సమస్య వచ్చిందని…అప్పుడు కెమికల్ గ్రౌటింగ్ వేశామని చెబుతున్నారు.
అసలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎందుకు వరుసగా సమస్యలు వస్తున్నాయి. లోపాలు ఎక్కడ జరిగాయి అన్న దిశగా కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘానికి కూడా నివేదిక పంపిస్తున్నారు తెలంగాణ డ్యాం సేఫ్టీ అధికారులు. అయితే ప్రస్తుతం వచ్చిన సీపేజీ వల్ల ఏ ప్రమాదం లేదని…దీని గురించి పెద్దగా ఊహించుకోవలసిన అవసరం లేదని చెబుతున్నారు.