DA Hike: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. బ్యాంక్ ఉద్యోగులకు 2024 మే- జులైకి సంబంధించి ‘డీఏ’ను 15.97 శాతంగా నిర్ణయించినట్లు ప్రకటించింది. జూన్ 10న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సర్క్యులర్ విడుదల చేసింది.
ఈ మేరకు బ్యాంకు ఉద్యోగులకు డీఏ ను ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ -2016 ను బేస్‌గా నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ లెక్కన 2016 CPI 123.03 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రతి 3 నెలలకొకసారి సగటు ద్రవ్యోల్బణం నుంచి దీనిని తీసేస్తే అది డీఏ అవుతుంది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంతో చూస్తే జనవరి 2024లో ఇది 138.9 గా.. ఫిబ్రవరిలో 139.2, మార్చిలో 138.9 గా ఉంది. ఈ లెక్కన మూడు నెలల సగటు ద్రవ్యోల్బణం 139 గా ఉండగా.. ఇది బేస్ రేటు 123.03 కంటే 15.97 పాయింట్లు ఎక్కువ. అంతకుముందు త్రైమాసికంలో 138.76 సీపీఐగా ఉండగా.. దీనితో పోలిస్తే డీఏ 0.24 శాతం పెరిగింది.