Balcony Collapsed : యూపీలోని బారాబంకి జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 8 గంటలకు పాఠశాలలో ప్రార్థన నిర్వహించేందుకు తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారుల అరుపులు విని పాఠశాల చుట్టుపక్కల ప్రజలు సాయం చేసేందుకు తరలి వచ్చారు. ప్రజలు పిల్లలను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ పాఠశాలలో 400 మంది పిల్లలు చదువుతున్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ వివరించారు.
విద్యార్థుల తరగతులు గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో జరుగుతాయి. మొదటి అంతస్తు నుంచి కిందకు రావాలంటే బాల్కనీ లో నుంచే రావాలి. పక్కనే మెట్లున్నాయి. పిల్లలు బాల్కనీలో ఉండగా బరువు పెరిగి 15 అడుగుల కింద పడిపోయారు. పిల్లలందరినీ సమీప ఆసుపత్రిలో చేర్చారు. పాఠశాల యాజమాన్యాన్ని అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.