కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సోషల్ మీడియాలో వింత ప్రశ్న ఎదురైంది. ఇన్ స్టాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’సెషన్ లో నెటిజన్ ఒకరు ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ ప్రశ్న వేశారు. దీంతో ఆమె నెటిజన్ చెంప చెల్లుమనిపించేలా సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకు ఏం జరిగిందంటే…. ఇన్ స్టాలో ఆమె ‘ఆస్క్ మీ ఎనీథింగ్’సెషన్ నిర్వహించారు. సెషన్ లో భాగంగా పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో నెటిజన్ ఒకరు… మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని అడిగారు. దీనికి ఆమె సూటిగా సమాధానం చెప్పారు. తన భర్త జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా తన కన్నా 13 ఏండ్లు పెద్దదని చెప్పారు.
ఆ కారణంగా మోనా తనకు బాల్య స్నేహితురాలయ్యే అవకాశం లేదన్నారు. అందువల్ల తాను తన స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్న వ్యాఖ్యలు సరికావన్నారు. మోనా రాజకీయ నాయకురాలు కాదన్నారు. అందువల్ల ఆమెను వివాదాల్లోకి లాగవద్దని కోరారు. కావాలంటే తనతో పోరాడండని అన్నారు. కావాలంటే తనతో వాదించాలని, తనను కించపరచండని అంతే కానీ రాజకీయాలతో సంబంధం లేని మోనా లాంటి వారిని వివాదాల్లోకి లాగొద్దన్నారు.
స్మృతి ఇరానీ బుల్లితెర నుంచి తన కెరీర్ ప్రారంభించారు. పలు టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో చేరి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. ఇటీవల లోక్ సభలో ఫ్లైయింగ్ కిసెస్ వివాదంలో ఆమె రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.