విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు చేశాయి. దీంతో సమ్మె నోటీస్‌ని ఏపీ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఉపసంహరించుకుంది. మాస్టర్ స్కేల్ రూ.2.60లక్షలు ఇచ్చేందుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపింది. అంతేకాదు 8 శాతం ఫిట్‌మెంట్‌కు కూడా ఓకే చెప్పింది. పే స్కేలు ఫిక్స్ చేసేందుకు ఏపీ జెన్కో ఎండీ ఆధ్వర్యంలో.. డిస్కంల సీఎండీలోతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదర్చుకున్నాయి. పీఆర్సీపై ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మాస్టర్‌స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు ఓకే తెలిపింది. 8 శాతం ఫిట్‌మెంట్‌కు సైతం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నిజానికి ఇవాళ అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఏపీ విద్యుత్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. వారం రోజులు సమ్మె వాయిదా వేయాలని యాజమాన్యం కోరినా వినిపించుకోలేదు. వాయిదా కుదరదని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. ఈ అర్ధరాత్రి నుంచి యాజమాన్యానికి సిమ్ములు హ్యాండ్ ఓవర్ చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. సమ్మె కార్యాచరణలో భాగంగా జేఏసీ నేతలు విజయవాడలోని విద్యుత్ సౌధ మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సౌధ వద్ద 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన యాజమాన్యం.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగులను రంగంలోకి దించాలని భావించింది. రేపటి(ఆగస్టు 9) నుంచి విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఇంతలోనే ప్రభుత్వంలో చర్చలు సఫలమయ్యాయి
ఇక పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించడంతో పాటు..కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తామని ఉద్యోగులు హెచ్చరిస్తూ వస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని మెరుపు సమ్మెకు దిగుతున్నట్లుగా నిన్న(ఆగస్టు 8) ప్రకటించింది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. చేపట్టబోయే నిరవధిక సమ్మె పోస్టర్లను కూడా విడుదల చేసింది. ఈ అర్ధరాత్రి నుంచే విద్యుత్‌శాఖలోని వాచ్మెన్ దగ్గర నుంచి ఇంజనీర్ వరకు అందరూ పాల్గొంటారని ప్రకటించింది. అయితే ఇంతలోనే ఊహించని ట్విస్ట్ వచ్చింది. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్‌కి యాజమాన్యం నుంచి అంగీకారం వచ్చింది. దీంతో సమ్మె లేదని ఉద్యోగులు ప్రకటించారు