Sanjoy Roy Mother: నా కొడుకు అమాయకుడు అంటున్నారు కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప, మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ తల్లి. తన కొడుకు తప్పుడు పనులు చేసేవాడు కాదని చెప్పారు. సంజయ్ స్కూల్ టాపర్ అని, బాక్సింగ్ నేర్చుకున్నాడని..ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు సంజయ్ రాయ్ తల్లి. సంజయ్ ఇలాంటి పనులు చేయడం వెనుక ఎవరో ఉన్నారని ఆమె ఆరోపించారు. అతనిని తప్పుడు పనులు చేసేలా ప్రభావితం చేసారని అంటున్నారు. వారెవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. తన కొడుకు స్వతహాగా మంచివాడని చెప్పారు. సంజయ్‌తో అతని తండ్రి ఎప్పుడూ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తాను కూడా అలాఏ ఉండి ఉంటే తన కుమారుడి జీవితం ఈరోజు ఇలా అయి ఉండేది కాదని చెప్పుకొచ్చారు.
సంజయ్ చాలా కేరింగ్ గా ఉంటాడని చెప్పారు అతని తల్లి. తనను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని…తనకి వంట కూడా చేసిపెట్టేవాడని చెప్పారు. కావాలంటే తమ ఇంటి దగ్గర చుట్టుపక్కల వారిని సంజయ్ గురించి అడగచ్చని..అతను ఎప్పుడూ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. అసలు సంజయ్ ఆర్జీ కర్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడని తనకు తెలియదని ఆమె అన్నారు. అలాగే అతను వేశ్యల దగ్గరకు వెళతాడనేది కూడా అబద్ధమని ఆమె తోసిపుచ్చారు. అయితే తన మొదటి భార్య చనిపోయాక మాత్రం నా కొడుకు మందుకు బాగా అలవాటు పడ్డాడని చెప్పారు. సంజయ్ మొదటి భార్య చాలా మంచిదని..ఆమెకు క్యాన్సర్ సోకడం వలన చనిపోయిందని తెలిపారు.
సంజయ్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్న అతని తల్లి తాను ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానని బాధపడ్డారు. సంజయ్ అరెస్ట్ తర్వాత తన కూతుళ్ళు, అల్లుళ్ళు తనను వదిలేశారని..తాను ప్రస్తుతం చాలా నిస్సహాస్థితిలో ఉన్నానని చెప్పారు. కోర్టులో ఎలా అప్పీల్ చేయాలో కూడా తెలియదని అన్నారు.