ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై ఆప్ తాలూకా సోషల్ మీడియా ఖాతాల్లో వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంపై నవంబర్ 16లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే…ఆప్ మాత్రం మోదీని టార్గె్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ ఫొటోలను షేర్ చేస్తూ ప్రధాని బిలియనీర్ల కోసమే ఉన్నారు కానీ సామన్య ప్రజల కోసం కాదంటూ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టినట్టు కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి, భాజపా జాతీయ మీడియా ఇంఛార్జి, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలౌని, పార్టీ నేత ఓం పాఠక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీని మీద స్పందించిన ఈసీ బీజేపీ నేత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆదేవించింది. నిర్ణీత సమయంలోపు సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read:భారత టెన్నీస్ సంచలనం సానియా మీర్జా పుట్టినరోజు నేడు.
మరోవైపు ప్రియాంక గాంధీకి కూడా ఈసీ ఇలాంటి షోకాజ్ నోటీసే జారీ చేసింది. ప్రధాని మోదీ మీద నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని రేపు రాత్రి లోపు వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. లాస్ట్ వీక్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించిన ప్రియాంక గాంధీ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
ఇతర రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి విధివిధానాలు, చేసిన పనుల గురించి మాత్రమే చెప్పాలి కానీ వ్యక్తిగత విమర్శలను చేయకూడదని ఈసీ అంటోంది. నిరాధారంగా ఆరోపణలు చేయడం అస్సలు మంచిది కాదని భారత ఎన్నికల సంఘం తెలిపింది.