S.V.Satyanarayana: సాధారణ వాక్యాన్ని కవితామయం చేయడం కష్టం. జీవితం ఉన్నవారికి అది సులభం. రాయడం ఎంత ముఖ్యమో, ఎదుటి వారికి ఆ జీవితాన్ని అర్థం చేయించడం కూడా అంతే ముఖ్యం. నిత్య కల్లోలాన్ని ఎదుటివారి మనోఫలకంపై చిత్రించే చతురత అందరికి అబ్బే కళ కాదు. మానవత్వాన్ని కవిత్వీకరించడంతో మొదలై అభ్యుదయాన్ని విప్పి చెప్పే దశను సాహిత్యంలో నిర్మాణం చేసిన కవి ఎస్వీ. సత్యనారాయణ. అన్ని విషయాలపై స్పష్టత గల వ్యక్తిగా తన జీవిత ప్రయాణానికి తానే వ్యాఖ్యానం రాసుకున్నట్లుగా ఒక కింది కవితలో ఇలా ప్రత్యక్షమవుతాడు.
“మనం కట్టిన గోడ కలకాలం నిలుస్తుందనుకోవడం,
జనం కట్టిన మేడ కూలకుండా కలకాలం కొనసాగుతుందనుకోవడం,
యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ విజయమే లభిస్తుందనుకోవడం
వెళ్లే మార్గం నిండా గులాబీలే పూస్తాయనుకోవడం భ్రమ”
అన్న స్పష్టతతో కవిత్వం రాసాడు. ప్రతీ వ్యక్తికి ఒక సాధారణ జీవితం ఉంటుంది. ఆ జీవితంలో ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సాధించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నాల్లో విజయం, పరాజయం రెండూ వస్తుంటాయి. వాటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లటమే మధ్యతరగతి మనిషి తత్త్వం. ఈ తత్త్వాన్నే ఎస్వీ పై కవితలో వ్యక్తం చేశాడు.
కాలాన్ని అత్యంత జాగ్రత్తగా ఒడిసిపట్టిన కవి..
ఎస్వీ సత్యనారాయణ కాలాన్ని అత్యంత జాగ్రత్తగా ఒడిసిపట్టి సమాజాన్ని అక్షరీకరించాడు. ప్రజలకు కాపు కాసిన ఆనాటి బస్తీ కవి. పాత బస్తీ కవి. జీవితాన్ని ఒక ఉద్యమంగా మలుచుకుని ప్రజల పక్షం వహించి, కవిత వజ్రాలను వెదజల్లిన రైతు కవి. ఈయన కవిగా మాత్రమే కాకుండా వక్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, రచయితగా, ప్రొఫెసర్‌గా అన్ని రంగాల్లోను తనదైన ముద్ర వేశాడు. తెలుగు ప్రాంతాలలో అభ్యుదయ రచయితల సంఘానికి మారుపేరుగా రూపొందాడు. ఒక వైపు ఉద్యమ జీవితం, మరొక వైపు అధ్యాపక జీవితం. అధ్యాపకత్వాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించిన కవి.
గోడలకు గొంతిచ్చి ప్రశ్నను బతికిచ్చినోడు..
నేడు పాతబస్తీ అంటే మరో పాకిస్థాన్ అని కొందరు అంటుంటారు. కానీ, ఒకప్పుడు అది పట్నానికి వలసొచ్చిన పల్లె. పల్లె వాసనలు ఇంకా ఆ గల్లీల్లో పరిమళిస్తుంటాయి. పట్నంలోని మాదిగ వాడ, కుమ్మరి వాడ, గౌడ వాడలకు నిలయం నాటి, నేటి పాతబస్తీ. జహంగీర్ చాచా, షంషుద్దీన్ మామ, పోతరాజు లక్ష్మయ్యలు మత సామరస్యానికి ప్రతీక. ఈయన గల్లీల పోంటి తిరిగిన కొంటె పోరడు. ఎవరనుకున్నారు గుడుంబా గుప్పుమంటున్న గల్లీలకు పోరాటం రుచి చూపించేవాడని? ఎవరు, ఏనాడూ అనుకోక పోవచ్చు. కవిత్వంతో సంసారం చేసే మనిషిని శివసాగర్ పుస్తకాన్ని గుంజుకొని పరిశోధకున్ని చేసిన గోపి సార్ కూడా అనుకోక పోవచ్చు. మంచి పరిశోధకుడు అవుతాడని. శాలిబండ గోడలకు గొంతిచ్చి ప్రశ్నను బతికిచ్చినోడు మన ఎస్వీ.
షంషీర్ గంజి చింతకాయలను, ఫలక్‌నుమ గుట్టల్లో మామిడి కాయలను, గౌలిపుర గల్లీల్లో గిల్లి దాండూల్, బాలా గంజ్ వీధుల్లో ఆడిన గోటీలాట, నోట్లోని ఐస్ గోలా, మిరాలం చెరువులో ఈత, వీధి భాగోతాలు, పీర్ల పండుగల నుండి సైకిల్ పై డబుల్ సవారీ చేస్తూ పోలీసు కంట్ల పడకుండా హిమాయత్ నగర్ గల్లీల గుండా ఆధునిక నగరంలోకి ప్రయాణం చేసిండు. పాతబస్తీలో గొడవలతో పాటు అక్షరాలను దిద్ది, సిటీ కళాశాల గుండా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకున్నడు.
హిందీ, ఉర్దూ భాషలను తలనిండా పులుముకుని..
“పురుటి నొప్పులు పడకుండా/ డిగ్రీల పురుగుల్ని కంటున్న విశ్వవిద్యాలయమా/ కొంత బాధైనా పరవాలేదు పడు/ మెరుపులలాంటి మేధావుల్ని ప్రసవించు” అని ప్రభోదించినట్లుగానే తనని తాను రూపొందించుకున్నాడు. హిందీ, ఉర్దూ భాషలను తలనిండా పులుముకున్నాడు. ఇంత వయస్సు వచ్చినా ఆ చిక్కదనం తన వెంట్రుకలకు అంటుకునే ఉందనుకుంటాను, ఇంకా అవి ఏపుగానే పెరుగుతున్నాయి.
ఈయన ప్రొఫెసర్ కె. గోపాల కృష్ణారావు పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1982లో “అబ్బూరి రామకృష్ణారావు రచనలు – సమగ్ర పరిశీలన” అనే అంశంపై ఎం. ఫిల్ పట్టాను, 1989లో ప్రొఫెసర్ ఎన్. గోపి పర్యవేక్షణలో “తెలుగులో ఉద్యమ గీతాలు” అంశంపై పిహెచ్డీ చేశాడు. తాను చదువుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఆచార్యునిగా, తెలుగు శాఖ అధ్యక్షునిగా, డీన్ గా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, వివిధ హోదాల్లో పనిచేశాడు. తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్‌గా 2016 జులై 26న బాధ్యతలు చేపట్టాడు. విద్యార్థుల సమస్యల పట్ల అంకిత భావంతో కృషి చేశాడు.
అమ్మ అంటేనే ఒక కావ్యం..
ప్రతి కవికి వ్యక్తంగానో, అవ్యక్తంగానో మొదటి కవిత వస్తువు అమ్మ అవుతుంది. అమ్మ అంటేనే ఒక కావ్యం. ప్రేమకు ప్రతిరూపం. మరి ఈ కవికి అమ్మ అంటే “అలల కదలికలనూ కలల కల్లోలాలనూ/ నిరాశల నిట్టూర్పులను/ నిబ్బరంగా మోసిన సముద్రం/ నిప్పు కణికలను గుండెలో దాచుకుని/ పెదాలపై వెన్నెల విరబూయించిన దయామయీ” అని తల్లిని తన మదిలో నిర్మించుకున్నాడు. అమ్మకు ఇంతకంటే గొప్ప నిర్వచనం ఎవరు ఇవ్వగలరు?. “పట్నమూ ఎవరికి కన్నతల్లి కాదు ప్రియురాలు మాత్రమే” అంటూ తన మెదక్ జిల్లా గ్రామాలను తలుచుకుంటాడు. ఒక చేత్తో కలం, మరో చేత్తో లాఠీ పట్టిన పాతబస్తీ కవి.
కవికి ప్రజల పక్షం వహించడమే అత్యున్నత పురస్కారం. అభ్యుదయమై విరబూయడమే కవితా సంతృప్తి. ఎస్వీ సత్యనారాయణ అధికార పక్ష వైఫల్యాలపై అధిక్షేప వర్షమై కురిసినోడు. “గోడలంటే అవి గోడలు కాదు, అవి నా అనుభవాల జాడలు. రోజు రోజుకూ ఎత్తుగా ఎదిగే నా మూలాల మేడలు” అంటూ గోడలకు చరిత్రలో స్థానం కల్పించినవాడు. తన ఇంటిని పుస్తక ముఖచిత్రంగా ముద్రించి, తన వేళ్లతో నిత్యం స్మరించుకున్న సున్నితమైన మనుష్యుడు. ప్రజలంటే “చెమట చుక్కలు, నడుస్తున్న చరిత్రలు/ ప్రజల జీవితాలు పదిల పరచుకోదగిన పవిత్ర ఇతిహాసాలు” గా గుర్తించి, ‘కష్ట జీవు’లకు ఇరువైపుల నిలిచిన సిసలైన ప్రజాకవి. పరిశోధకుడు. మా ఊరి (కందుకూరు, రంగారెడ్డి జిల్లా) మేనల్లుడు, బొచ్చుపల్లిలోని మా ఆడ పిల్ల కొడుకు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు గుండె నిండుగా శుభాకాంక్షలు.
ఇమ్మిడి మహేందర్
అధ్యాపకులు, సైఫాబాద్ సైన్స్ కళాశాల, ఓయూ.