ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మరోసారి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయనకు మరో ఐదు వారాల పాటు బెయిల్ ను సుప్రీం కోర్టు పొడిగించింది. ఈ నెల 21న సత్యేందర్ జైన్ కు వెన్నుముక సర్జరీ జరిగిందని, ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టు ధర్మాసనానికి వెల్లడించారు.
జైన్ కు బెయిల్ పొడిగింపు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఈడీ తరఫున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వెల్లడించారు. దీంతో సత్యేందర్ జైన్ బెయిల్ ను మరో ఐదు వారాల పాటు పొడిగిస్తున్నట్టు జస్టిస్ ఏఎస్ బోపన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం తెలిపింది. ఐదు వారాల తర్వాత తదుపరి విచారణను చేపట్టనున్నట్టు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై సత్యేంద్ర జైన్ ను గత ఏడాది మే 30న ఈడీ అరెస్టు చేసింది. ఈ ఏడాది మే 26న వైద్య పరమైన కారణాల రీత్య ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. దేశ పౌరునిగా ఆయన తనకు స్వంత ఖర్చుపై తనకు నచ్చిన ఆస్పత్రిలో మెరుగైన వైద్యం పొందే హక్కు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
అనతరం ఈ నెల 10న ఈ కేసులో విచారణ జరిగింది. ఆయన మెడికల్ రికార్డులు పరిశీలించిన ధర్మాసనం బెయిల్ ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. బెయిల్ సమయం నేటితో ముగిసింది. దీంతో మరోసారి ఆయన బెయిల్ గడువును పొడిగిస్తున్నట్టు చెప్పింది.