టమాట ధరలకు కళ్లెం వేసేందుకు ఇప్పటికే కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ చర్యల్లో భాగంగా ఆన్ లైన్ లో సబ్సిడీపై టమాట విక్రయాలను మొదలు పెట్టింది. నేటి నుంచి ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్ డీసీ) ప్లాట్ ఫారమ్ ద్వారా టమాటాలు కిలో రూ. 70కే విక్రయిస్తున్నట్టు ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ నేషనల్ కోపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్సీసీఎఫ్)పేర్కొంది.
ఢిల్లీలో సబ్సిడీపై టమాటలను విక్రయించేందుకు ఓఎన్ డీసీతో తాము భాగస్వామ్యం కుదర్చుకున్నట్టు ఎన్సీసీఎఫ్ ఎండీ అనీస్ జోసెఫ్ చంద్ర వెల్లడించారు. వినియోగదారులు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు టమాటాలకు ఆర్డర్ చేయవచ్చని తెలిపారు. అలా ఆర్డర్ చేసిన వారికి మరుసటి రోజు ఉదయం టమాటలను డెలివరీ చేయనున్నట్టు వెల్లడించారు.
ఇందులో డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉందని తెలిపారు. డోర్ డెలివరీ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదన్నారు. ఆ ఇంటర్ ఫేస్ చాలా సింపుల్ గా, యూజర్ ఫ్రెండ్లీగా వుంటుందన్నారు. యాప్ లో రూ. 70లకే కిలో టమాట అందిస్తున్నామన్నారు. కానీ ఒక్క యూజర్ కు రోజుకు రెండు కిలోల వరకు మాత్రమే ఆర్డర్ చేసేందుకు అనుమతిస్తున్నామన్నారు.
దేశంలో ఇటీవల టమాట ధరలు పెరిగాయి. పలు నగరాల్లో టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా నగరాల్లో రూ. 150 నుంచి 200 వరకు ధర పలుకుతోంది. ఈ క్రమంలో ధరలకు కళ్లెం వేసేందుకు టమాటలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది.