దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ(BJP) కి షాక్ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandra Bose) మనవడు చంద్రకుమార్ బోస్ (Chandra Kumar Bose) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసిన తరువాత ఆయన మీడియాతో ప్రసంగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్..మతపరమైన రాజకీయాలకు, విభజన రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకి అని, అలాంటి వాటి గురించి ఆరోజుల్లోనే నేతాజీ పోరాటం చేశారని ఆయన అన్నారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకుని వచ్చి పరిపాలించాలని బీజేపీకి సూచించారు. ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదని, రాజీనామా చేసి బయటకు వెళ్లిన్నప్పటికీ బీజేపీకి ఎప్పుడూ కూడా తన పూర్తి సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఇదిలా ఉంటే పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో పాటు..ఆయనను ఎవరూ గుర్తించడం లేదనే అంశాల మీద ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు..''నేను బెంగాల్ అభివృద్ధికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి కానీ, బెంగాల్ బీజేపీ కేంద్ర నాయకత్వానికి కానీ చాలా ప్రతిపాదనలు చేశాను. ఆ ప్రతిపాదనలు బాగున్నాయని చెప్పారు. నాతో వాటి గురించి చర్చలు కూడా జరిపారు. కానీ వాటిలో ఒక్కటి కూడా అమలులోకి రాలేదు. నేను పాటించే ఆదర్శాలను కానీ, నేను సూచించిన ప్రతిపాదనలు కానీ పట్టించుకోనప్పుడు, పాటించనప్పుడు ఈ పార్టీలో ఉన్న ఒక్కటే..లేకపోయినా ఒక్కటే'' అని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ఉన్న వర్గాల వారిని ఏకం చేసుకుంటూ పోవాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలిపినట్లు ఆయన వివరించారు. తన పూర్వీకులు అయినటువంటి శరత్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల భావాలను దేశంలో విస్తృతం చేసి ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు బీజేపీలో చేరానని ఆయన స్పష్టం చేశారు.
దానికి తగినట్లుగా ఆజాద్ హింద్ మోర్చా కూడా ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలకు సూచించాను కానీ పార్టీ నుంచి కానీ, పార్టీ పెద్దల నుంచి కానీ తనకు ఎటువంటి సహాయ సహాకారాలు అందలేదని ఆయన అసంతృప్తిని వ్యక్త పరిచారు.