- ప్రకాశం జిల్లా గిద్దలూరులో వెలుగు చూసిన ఘటన
- గతేడాది పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి
- నాటి నుంచీ పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం
- గురువారం ప్రిన్సిపల్‌పై దాడి, బ్లేడుతో గొంతుకోసేందుకు యత్నం
- బాధితుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో చిన్న మసీదు ప్రాంతంలో నివాసం ఉండే గొంట్ల గణేశ్ అనే యువకుడు స్థానిక సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గతేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్భంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచీ అతడు ఆ కళాశాల ప్రిన్సిపల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిపోయాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలని పగ పెంచుకున్నాడు.
గిద్దలూరులోని స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డిపై గణేశ్ అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. బ్లేడుతో కొండారెడ్డి గొంతు కోయబోతుంటే అతని చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి కూడా తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో స్థానికులు కొండారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి కొండారెడ్డితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం... గణేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.