క్రికెట్‌కు స్టువర్ట్ బ్రాడ్ అద్భుత ముగింపు.. యాషెస్ సిరీస్ సమం

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుతంగా ముగింపు పలికాడు. కెరీర్‌ చివరి ఓవర్లలో రెండు వికెట్లు ఇంగ్లీష్ జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు. దీంతో ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ 2-2తో సమం అయింది.

New Update
క్రికెట్‌కు స్టువర్ట్ బ్రాడ్ అద్భుత ముగింపు.. యాషెస్ సిరీస్ సమం

అద్భుతంగా కెరీర్ ముగింపు.. 

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ప్రకటించి క్రీడా ప్రపంచానికి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోయారు. కానీ 37ఏళ్లు రావడంతో కుర్రాళ్లుకు జట్టులో చోటు ఇవ్వాలనే ఉద్దేశంతో బ్రాడ్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే యాషెస్ సిరీస్ ఐదో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా చివరి లైనప్‌లోని రెండు వికెట్లను తీసి తన కెరీర్‌కు అద్భుతంగా ముగింపు పలికాడు. బ్రాడ్ మొత్తం 167 టెస్టుల్లో 602 వికెట్లు సాధించాడు. 121 వన్డేల్లో 178 వికెట్లు.. 56 టి20ల్లో 65 వికెట్లు తీశాడు. వన్డే, టి20ల్లో పెద్దగా రాణించలేకపోయినా టెస్టుల్లో మాత్రం మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన టెస్టు బౌలర్ల జాబితాలో బ్రాడ్ ఐదో స్థానంలో ఉన్నాడు.

బ్రాడ్ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.. 

భారత అభిమానులకు స్టువర్ట్ బ్రాడ్ పేరు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఇండియా ఫ్యాన్స్‌తో పాటు బ్రాడ్‌కు 2007 టీ20 ప్రపంచకప్‌ గుర్తు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ సందర్భంగా బ్రాడ్ బౌలింగ్‌లో సింగ్ ఈజ్ కింగ్ యువరాజ్ ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మలిచాడు. అప్పుడే క్రికెట్ కెరీర్ ప్రారంభించిన బ్రాడ్‌కు ఆ రోజు పీడకలగా మిగిలిపోయింది. చాలా రోజుల పాటు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడు. అయినా కానీ ఆ చేదు జ్ఞాపకాలను అధిగమించి ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్‌గా బ్రాడ్ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా చెప్పుకోవచ్చు. 2016లో చివరి వన్డే ఆడిన అతడు అప్పటి నుంచి కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

2-2తో యాషెస్ సిరస్ సమం..

ఇక యాషెస్ సిరీస్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచుల సీరిస్‌లో తొలి రెండు మ్యాచులను ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లండ్ జట్టు మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది. నాలుగో టెస్టులో కూడా అద్భుతంగా ఆడింది. విజయం అంచున ఉన్న సమయంలో వరుణుడు అడ్డురావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక చివరిదైన ఐదో మ్యాచులోనూ సూపర్‌గా ఆడి గెలుపు సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ 2-2తో సమం అయింది. అయితే సిరీస్ డ్రా కావడంతో యాషెస్ కప్ ఆసీస్ జట్టు వద్దనే ఉండనుంది. ఎందుకంటే గత సిరీస్ విజేత ఆస్ట్రేలియానే కాబట్టి బూడిద కప్ వారికే దక్కుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు