Kinjarapu Ram Mohan Naidu Profile: కేంద్ర కేబినెట్ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం 25 ఏళ్ల వయస్సుల్లోనే ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు తాజా విజయంతో హ్యాట్రిక్ అందుకున్నారు. టీడీపీ మొత్తం 16 ఎంపీ స్థానాలు సాధించి ఎన్డీఏలో కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. దీంతో మూడు సార్లు విజయం సాధించిన తన మిత్రుడు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం కల్పించారు చంద్రబాబు.
తండ్రి మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశం..
రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996-98 మధ్య కేంద్ర మంత్రిగా సైతం పని చేశారు. అయితే.. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేడర్ కోరిక, చంద్రబాబు సూచనలతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2013 నుంచి టీడీపీలో యాక్టీవ్ గా మారారు. చక్కని వాక్చాతుర్యం కూడా రామ్మోహన్ నాయుడు సొంతం. దీంతో ఆయన శ్రీకాకుళం ప్రజలకు త్వరగా కనెక్ట్ అయ్యారు. 2014లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వడంతో తండ్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం నుంచి ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు.
చిన్నతరంలోనే పార్లమెంట్ లోకి అడుగుపెట్టినా.. వివిధ అంశాలపై ఆయన గళమెత్తిన తీరు తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. ఇంగ్లిష్, హిందీ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉండడం అదనపు అడ్వాంటేజ్ గా మారింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా శ్రీకాకుళం నుంచి ఆయన మాత్రం ఎంపీగా విజయం సాధించారు.
టీడీపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించగా అందులో రామ్మోహన్ నాయుడు ఒకరు కావడం విశేషం. ఈ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడితో పాటు ఆయన బాబాయి టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా, సోదరి ఆదిరెడ్డి భవాని రాజమంత్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బాల్యం, విద్యాభ్యాసం
శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మడలో రామ్మోహన్ నాయుడు 1987 డిసెంబర్ 18న జన్మించారు. 3వ తరగతి వరకు శ్రీకాకుళం లోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో విద్యనభ్యసించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్లో 4, 5వ తరగతి చదువుకున్నాడు. 1998 నుంచి 2004 వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు రామ్మోహాన్ నాయుడు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ స్లోని విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఎంబీఏను లాంగ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆ తర్వాత సింగపూర్ లో ఏడాది పాటు ఉద్యోగం సైతం చేశారు ఆయన.