Australian Women Cricketers: భారత్‌లో దారుణం.. ఆసీస్ మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులు - నిందితుడు అరెస్ట్!

మహిళల ప్రపంచకప్ 2025 కోసం ఇండోర్‌కు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఈ సంఘటనపై ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు త్వరగా అరెస్టు చేశారు. ఈ ఘటనపై బీసీసీఐ (BCCI) క్షమాపణలు చెప్పింది.

New Update
Australian Women Cricketers

Australian Women Cricketers

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు క్రీడాకారిణులకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చేదు అనుభవం ఎదురైంది. హోటల్ నుంచి కెఫేకు నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఇద్దరు ప్లేయర్‌లను ఒక ఆకతాయి బైక్‌పై వెంబడించి వేధించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

women world cup 2025

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇండోర్‌కు చేరుకుంది. రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేసిన ఇద్దరు క్రికెటర్లు గురువారం (అక్టోబర్ 23) హోటల్ గది నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ సమీపంలోని ఒక కెఫే వైపు వెళ్తున్నారు. అదే సమయంలో అఖిల్ ఖాన్ అనే వ్యక్తి బైక్ పై వచ్చి వారిని వెంబడించాడు. అక్కడితో ఆగకుండా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వారిలో ఒకరిని అనుచితంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు వెంటనే తమ జట్టు సెక్యూరిటీ మేనేజర్ డానీ సిమ్మన్స్‌కు ఎమర్జెన్సీ మెసేజ్‌ ద్వారా సమాచారం అందించారు. మేనేజర్ డానీ సిమ్మన్స్ వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి.. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించడంతో.. ఆ నంబర్ ఆధారంగా నిందితుడు అఖిల్ ఖాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుతం క్రికెటర్లు సురక్షితంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య కీలకమైన గ్రూప్ మ్యాచ్ జరగడానికి కొద్ది గంటల ముందు ఈ వార్త బయటకు రావటం కలకలం సృష్టించింది.

Advertisment
తాజా కథనాలు