వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మెరిసిన మీరాబాయి చాను

ఇండియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో మీరాబాయి చాను 48 కిలోల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

New Update
_World Weightlifting Championships 2025

ఇండియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో మీరాబాయి చాను 48 కిలోల విభాగంలో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి ఒలింపిక్ పతక విజేత కూడా. ఈ మెగా ఈవెంట్‌లో మీరాబాయి మొత్తం 199 కిలోల (స్నాచ్‌లో 84 కిలోలు + క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు) బరువు ఎత్తి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 115 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి, ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత (అక్కడ ఆమె 4వ స్థానంలో నిలిచింది) అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య 49 కిలోల విభాగాన్ని తొలగించడంతో, మీరాబాయి చాను కొత్తగా ప్రవేశపెట్టిన 48 కిలోల విభాగంలో పోటీపడటం గమనార్హం.

ఈ పోటీలో చైనాకు చెందిన జియాంగ్ జిహువా స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, మీరాబాయి చాను కేవలం కొద్ది తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయింది. అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి పోటీలో ఈ ప్రదర్శన పట్ల మీరాబాయి సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో మీరాబాయి చానుకి ఇది రెండవ మెడల్. 2017లో ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశానికి మొదటిసారిగా వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ గుర్తింపును తెచ్చింది.

మీరాబాయి చాను సాధించిన ఈ రజత పతకం రాబోయే టోర్నమెంట్‌లు, ముఖ్యంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ (గ్లాస్గో 2026)కు ముందు ఆమెకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ విజయం ఆమె కఠోర శ్రమకు, అంకితభావానికి నిదర్శనం అని భారత వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రశంసించింది. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, ప్రముఖులు మీరాబాయికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె భవిష్యత్తు విజయాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

Advertisment
తాజా కథనాలు