ఆసియా గేమ్స్ లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఎంపిక చేసినందుకు గానూ అండర్-20 రెజ్లర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు ఆసియా క్రీడల్లో ట్రయల్స్ లేకుండా ఎంట్రీ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్‌ఐ అడ్‌హక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై అండర్-20 ప్రపంచ ఛాంపియన్ అంతిమ్ పంఘాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.మిగతా విభాగాలకు రెజ్లర్లను ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతిమ్ పంఘాల్ బుధవారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేసింది.
నేరుగా సెలెక్ట్ ఎందుకు చేయలేదంటూ...
ఈ వీడియోలో పంఘాల్ మాట్లాడుతూ గతేడాది జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున స్వర్ణ పతకం సాధించా. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచా. 2023 ఏషియన్ ఛాంపియన్‌షిప్ టోర్నీలోనూ రజత పతకం గెలిచా. కానీ వినేశ్ గత సంవత్సర కాలంగా ఏ పతకాలు సాధించలేదు. పైగా గాయాలతో ఏడాదిగా ఆమె ప్రాక్టీస్‌లోనే లేదు. అయినా ఆమెను నేరుగా ఎలా సెలక్ట్ చేస్తారు.? అయితే సాక్షి మాలిక్ ఒలంపిక్ పతకాన్ని సాధించింది. తనను ఎందుకు నేరుగా సెలెక్ట్ చేయలేదు. వినేశ్ మాత్రమే ఎందుకంత స్పెషల్ అని చెప్పుకొచ్చింది. వినేశ్ ఓడించేవారు చాలా మంది భారత్ లో ఉన్నారని అంతిమ్ పంఘాల్ పేర్కొంది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధిస్తేనే ఒలింపిక్స్‌కు ఛాన్స్...
ఆసియా గేమ్స్ కు వెళ్లిన వారంతా.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లే అర్హత సాధిస్తారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధిస్తే ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశముంటుంది. ఇందుకోసం మేం కొన్నేళ్లుగా కఠోరంగా శ్రమిస్తున్నాము. ఇలా వినేశ్ ను నేరుగా సెలెక్ట్ చేస్తే మేమంతా రెజ్లింగ్ వదిలేయాలా అని తన ఆవేదను వ్యక్తం చేసింది. ఏ నిబంధనల ఆధారంగా వినేశ్‌ను ఎంపిక చేశారని ఆమె ప్రశ్నించింది. డబ్ల్యూఎఫ్‌ఐ మార్గదర్శకాల ప్రకారంసెలక్షన్ ట్రయల్స్ తప్పనిసరి. అయితే చీఫ్ కోచ్ లేదా విదేశీ నిపుణుడి సిఫారసు మేరకు ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన మేటి రెజ్లర్లను ట్రయిల్స్ లేకుండానే సెలెక్ట్ చేసే అధికారం కమిటీకి ఉంటుంది.