Women’s Day 2024: సంప్రదాయాన్ని చెరగనివ్వని మహిళ.. చీరకట్టుకు ఆధునికత నేర్పిన యువతి!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాటి మహిళల కోసం ఇటు సంప్రదాయాన్ని.. అటు ఉపాధిని రెండిటినీ జోడిస్తూ స్ఫూర్తివంతమైన ప్రయాణం సాగిస్తున్న మహారాష్ట్రకు చెందిన ‘పాకెట్ శారీవాలీ’ స్వాతి సింగ్ పై ప్రత్యేక కథనం కోసం ఇక్కడ చూడండి. 

New Update
Women’s Day 2024: సంప్రదాయాన్ని చెరగనివ్వని మహిళ.. చీరకట్టుకు ఆధునికత నేర్పిన యువతి!

Women’s Day 2024: టెక్నాలజీ పెరిగింది. మనిషి ఆలోచనాధోరణి మాత్రం ఇంకా మారలేదు. ఇది ఊరికే అనేమాట కాదు. సోషల్ మీడియా ప్రపంచంలో విహరించడం అలవాటైపోయిన మనం ప్రత్యేక దినోత్సవాలను శుభాకాంక్షల సందేశాలను చెప్పుకోవడంతో సరిపెట్టేస్తున్నాం. ఇందుకోసం ఆ రోజును ప్రత్యేకంగా ప్రకటించారు? దానివెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. నలుగురితో నారాయణ అన్నట్టుగా ఒక శుభాకాంక్షలు సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి సంబరాన్ని జరిపేసుకుంటామంతే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, శుక్రవారం (మార్చి 8) రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో పంచుకునే ముందు ఒక వనిత కథ తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడం ఈ ప్రత్యేకమైన రోజున చాలా అవసరం కూడా. ఎందుకంటే, సమాజంలో ఇప్పటికీ అమ్మాయి అంటే చిన్న చూపు పోలేదు. పుట్టిన దగ్గర నుంచి మరణం దాకా మహిళ తన జీవితంలో చాలా సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొంటూనే వస్తుంది. నీకేం చేతనవును అనే రుసరుసలు దగ్గర నుంచి ఆటబొమ్మ లా అవమానించడం వరకూ మహిళ విషయంలో మనం నిత్యం ఎన్నో అవమానకారా సంఘటనలకు సాక్షులుగా నిలుస్తున్నాం. సమాజంలో అన్నీ బావుంటేనే, అంటే తల్లిదండ్రులు.. బంధుగణం.. డబ్బు ఇలా అన్నీ ఉంటేనే ఒక స్త్రీ గౌరవంగా బ్రతకడం కష్టమైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. అంతెందుకు మహిళ వస్త్రధారణపై ఇప్పటికీ ఒకరకమైన వెకిలి భాషణలు చేసేవారు ఎందరో ఉన్నారు. మోడ్రన్ డ్రస్ వేసుకుంటే ఒకరకంగా.. చీర కట్టుకుంటే మరోరకంగా మాట్లాడే వారు చాలామంది మన మధ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా వర్కింగ్ ప్లేస్ లో ఈ వివక్షాపూరిత కామెంట్స్ చాలా ఎక్కువ. ఇటువంటి కామెంట్స్ కి తమలో తామే కుమిలిపోయేవారు చాలామందే ఉంటారు. 

Women’s Day 2024: ముఖ్యంగా చీర విషయంలో అయితే వచ్చే కామెంట్స్ ఒక్కోసారి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మన సంప్రదాయ వస్త్రధారణ నిస్సందేహంగా చీర. కానీ, అది వర్క్ ప్లేస్ లో ఎన్నో ఇబ్బందులు తెస్తుంది. ఒకచోట నుంచి ఒక చోటుకు చేసే ప్రయాణంలో చీరతో చెప్పలేని ఇబ్బందులు పడతారు మహిళలు. అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది.. చీర కట్టుకోవడం. దానిని రోజంతా ఉద్యోగ బాధ్యతల్లో జారిపోకుండా చూసుకోవడం.. ఇది చాలా కష్టమైన విషయం. దీనికోసం ఒక ఉపాయం కనిపెట్టింది స్వాతి సింగ్. మహిళలు సంప్రదాయ చీరలో తమ రోజువారీ జీవనాన్ని సౌకర్యవంతంగా గడిపే విధంగా చీరను కట్టుకోవడానికి రెడీ టు వేర్ చీరను పరిచయం చేసింది. ఈ చీరలు ఇప్పుడు యువతులకు చాలా సౌకర్యవంతంగా మన సంప్రదాయాన్ని నిలబెట్టేలా చీరను ధరించడం సులభతరం చేసింది. అసలు స్వాతి సింగ్ ఇలా చీరలు చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆమె ఎవరు? ప్రత్యేకంగా ఆమె గురించి ఈరోజు చెప్పుకోవడం ఎనుదుకు? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి కదూ. ఒక్క రెడీ టు వేర్ చీర కనిపెట్టినందుకే స్వాతి సింగ్ గురించి మనం చెప్పుకోవడం లేదు. ఆమె వెనుక ఒక పెద్ద కథ ఉంది. సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన స్ఫూర్తివంతమైన స్టోరీ ఉంది. అదేమిటో పూర్తిగా తెలుసుకుందాం. 

Women’s Day 2024: స్వాతి సింగ్ ఫ్యాషన్ డిజైనర్ కాదు. ఆమెకు చీర కట్టుకోవడం అంటే ఇష్టం, కానీ ఎలా కట్టుకోవాలో తెలియదు. ఎవరైనా చీర కట్టుకున్నా రోజంతా కట్టుకోవడం కష్టం. తన చుట్టూ ఉన్న చాలా మంది స్త్రీలు 'శారీ మింగ్' బారిన పడటం ఆమె చూసింది మరియు చీర కట్టుకోనందుకు ఇంట్లో పెద్దల నుండి అవమానాలు..  ఆగ్రహాన్ని కూడా చూసింది.కార్పొరేట్ ఈవెంట్‌లలో ఆధునిక శైలిలో చీరను ధరించాలనుకునే, కానీ తన సౌకర్యాన్ని కోల్పోకూడదనుకునే నేటి ప్రపంచ భారతీయ మహిళ అవసరాన్ని ఆమె అర్థం చేసుకుంది. ఆమె ఒక రెడీ-టు-వేర్ చీరను డిజైన్ చేసింది.  దానిలో పాకెట్‌ను కూడా చేర్చింది, తద్వారా ఆధునిక భారతీయ మహిళ తనకు అవసరమైన వస్తువులను చీర జేబులో ఉంచుకోగలుగుతోంది. చీర కట్టుకోవడం స్త్రీలకూ సౌకర్యంగానూ, ఆకర్షణీయంగానూ ఉండాలి. మహిళలు ఈ ఆలోచనను ఎంతగానో ఇష్టపడ్డారు.  దీంతో స్వాతి సింగ్  'పాకెట్ సారీ వాలీ' పేరుతో ప్రసిద్ధి చెందింది.

దిగువ మధ్యతరగతి అమ్మాయి.. 
Women’s Day 2024: స్వాతి సింగ్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన  చుట్టూ ఉన్న స్త్రీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం చూస్తూ ఎరిగింది.  మహిళలు కొంత డబ్బు కోసం వింత పనులు చేయడం.. తనకు బాధగా అనిపించేది.  పెద్దయ్యాక, ఈ ఆడవాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఆమె అనుకుంది. తాను ఉన్న ప్రాంతంలో మహిళలు కాస్మొటిక్స్, మేకప్ సామాగ్రి తయారు చేసే చోట వాటిని పరీక్షించే పని కోసం వెళ్లేవారు. ఆ వస్తువులను వారి మీద పరీక్షించే వారు. ఒక్కోసారి కొందరు మహిళలు దీని కోసం తల నుంచి వెంట్రుకలు కూడా తొలిగించుకోవాల్సి వచ్చేది. ఇంతా చేస్తే వారికీ వచ్చేది 100 నుంచి 200 రూపాయలు మాత్రమే. ఇలా డబ్బు సంపాదించడం కోసం ఆడవాళ్లు తమ ఆరోగ్యంతో ఆదుకోవడం స్వాతికి నచ్చలేదు. ఆమె తండ్రి ప్రాపర్టీ కన్సల్టెంట్.  తల్లి గృహిణి. తమ్ముడు ఇంజనీర్‌కు వివాహమైంది. దీంతో ఆమె  పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన ఉండేది. కానీ ఆమె అదృష్టం ఏమిటంటేవారు ఇందుకోసం ఆమెపై ఒత్తిడి తీసుకురాలేదు. దీంతో తానూ అనుకున్నది చేయడానికి స్వాతికి అవకాశం దొరికింది. 

యువతకు ఇంగ్లీషు నేర్పడంతో మొదలెట్టి.. 
Women’s Day 2024: ఎం.కామ్ చేశాక కాలేజీలో టీచింగ్ మొదలుపెట్టింది స్వాతి. కానీ రోజూ కాలేజీకి వెళ్లి ఒకే సిలబస్ నేర్పించడం అనే పని నచ్చలేదు. సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే తపనతో ఉండేది. తర్వాత యువతకు ఇంగ్లీషు నేర్పడం మొదలు పెట్టింది. ఎం.కామ్‌ తర్వాత సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అయింది.. ఇందుకోసం పగలు, రాత్రి చదివినా సెలెక్ట్ కాలేదు. దీంతో సమాజంపై సానుకూల ప్రభావం చూపించే ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంది. తన చుట్టూ ఉన్న మహిళలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలనుకుంది. అప్పుడు వచ్చిందే  'రెడీ టు వేర్ పాకెట్ చీర' ఆలోచన దీంతో ఆలయం కళను నెరవేర్చుకోగలిగింది. ఇప్పుడు ఆ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించారు.

తండ్రి నేర్పిన క్రౌడ్ ఫండింగ్ ఆలంబనగా..
Women’s Day 2024: స్వాతికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆమె తండ్రి పాన్ అమ్ముతూ జీవించేవారు. అయన ఒకరోజు ఇంటికి వస్తుండగా రైలు ఢీ కొని ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన స్వాతి తట్టుకోలేకపోయింది. స్నేహితురాలికి ఏదైనా సహాయం చేయాలనీ తండ్రిని అడిగింది. దానికి తండ్రి.. 500 రూపాయలు ఇచ్చి నేను ఇంతవరకూ సహాయం చేయగలను. ఇలా మీ స్నేహితులందరూ కలిసి తలోకొంచెం కలుపుని మీ ఫ్రెండ్ కి సహాయం చేయవచ్చు అని చెప్పారు. స్కూల్ టీచర్ తో మాట్లాడి అలా అందరి వద్దా డబ్బు తీసుకుని తన ఫ్రెండ్ కి సహాయం చేసింది. అప్పుడు ఆమెకు అర్ధం అయింది. ఐక్యత కు ఉండే శక్తి చాలా గొప్పదని. క్రౌడ్ ఫండింగ్ వలన చాలా సమస్యలు తేలిక అవుతాయని తెలిసింది. అటు తరువాత.. స్కూల్ టీచర్ కిడ్నీ పాడైపోయినప్పుడు కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు వసూలు చేసి సాయం చేసింది స్వాతి. 

అసీమ్ శక్తి..
Women’s Day 2024: ఇప్పుడు 'అసీమ్ శక్తి' పేరుతో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. ఈ మొత్తంతో మహిళలకు ఉపాధి, పిల్లలకు మంచి చదువులు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో 500 మంది మహిళలు సహకరిస్తున్నారు.

మహిళలకు ఉపాధి కల్పించడం ముఖ్యం
Women’s Day 2024: “చదువుకోని మహిళలు సొంతంగా వ్యాపారం చేసేందుకు భయపడుతున్నారు. ఈ మహిళలకు అలాంటి ఉపాధి అవసరం, ఇక్కడ వారు ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత పనికి వెళ్లి కొంత డబ్బు సంపాదించవచ్చు. నా 'రెడీ టు వేర్ పాకెట్ శారీ' ఐడియాని మొదట ఫ్యాషన్ డిజైనర్‌కి చెప్పాను. చీరల నమూనాలతో మేము సంతృప్తి చెందినప్పుడు, ఈ మహిళలకు 'రెడీ టు వేర్ పాకెట్ చీరలు' తయారు చేయడం నేర్పించాము. మాతో అనుబంధం ఉన్న మహిళలు ఇప్పుడు ఈ పనిలో నిపుణులయ్యారు.” అంటూ స్వాతి తన రెడీ టు వేర్ పాకెట్ శారీ ల వెనుక కథ గురించి చెప్పారు. 

స్టాండప్ ఇండియా నుంచి రుణం..
Women’s Day 2024: స్వాతి ఈ ఆలోచన చేసినపుడు ఆమె  దగ్గర డబ్బు లేదు. ఆ తర్వాత స్టాండప్ ఇండియా నుంచి రూ.15 లక్షలు అప్పు తీసుకుని ‘రెడీ టు వేర్ పాకెట్ సారీ’ వ్యాపారం ప్రారంభించారు.  అతి తక్కువ సమయంలోనే వారి వ్యాపారం పాపులర్ అయింది.  చీరల తయారీకి ఆర్డర్లు రావడం ప్రారంభించాయి. ఇప్పుడు చీరలు వారు తయారు చేయడమే కాకుండా.. మహిళలు తాము తెచ్చుకున్న చేరాలను కూడా తీసుకుని 'రెడీ టు వేర్ పాకెట్ చీర'లుగా మార్చి వారికి అందజేస్తున్నారు. 

ఒక్క వీడియో వైరల్..
Women’s Day 2024: స్వాతి సింగ్ తయారు చేసిన  చీర కట్టుకున్న నటి రాజేశ్వరి సచ్‌దేవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని తర్వాత, 'రెడీ టు వేర్ పాకెట్ చీరలు' కోసం చాలా ఆర్డర్లు రావడం ప్రారంభించాయి. తరువాత మరింత మంది మహిళలను ఇందులో చేర్చుకున్నారు. ఇప్పుడు స్వాతికి  'పాకెట్ శారీ వాలి' నా స్వంత గుర్తింపు దొరికింది. 

Also Read: విమెన్స్‌ డే విషెస్‌ చెప్పడంతో ఒరిగేదేంటి..? మారాల్సింది వారి బుద్ధి కదా!

“భారతీయ మహిళలు ఇప్పుడు తమ ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫీసు, ఈవెంట్ లేదా కాన్ఫరెన్స్‌లో వారి సంప్రదాయ వస్త్రధారణ చీరను ధరించడంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, మేము చీర కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. చీర జేబులో మొబైల్, ఇతర అవసరమైన వస్తువులు పెట్టుకుని మహిళలు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రయాణించేందుకు వీలుగా చీరలో పాకెట్స్ పెట్టాము. మహిళలు 'రెడీ టు వేర్ పాకెట్ శారీ' ధరించడం ద్వారా స్టైల్, గాంభీర్యం, సౌకర్యాన్ని పొందుతారు. ఇప్పుడు చీర మహిళలకు అనుకూలమైన వస్త్రంగా మారింది.” అంటూ స్వాతి సింగ్ చెబుతున్నారు. 

అదండీ విషయం.. ఒక మహిళగా సాటి మహిళలకు ఉపాధి కల్పించాలని చిన్నప్పుడు ఏర్పరుచుకున్న లక్ష్యం వైపుగా స్వాతి సింగ్ సాగించిన విజయవంతమైన ప్రయాణం. మహిళా దినోత్సవం రోజున ఇటువంటి మహిళల కథలు మహిళలకే కాదు సమాజంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

రెడీమేడ్ శారీ ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వీడియోలో చూసేయండి..

#international-womens-day-2024
Advertisment
తాజా కథనాలు