South Central Railway Special Trains: సంక్రాంతికి ఊర్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఊళ్లకు వెళ్లే వారికి సౌకర్యంగా ఉండేలా పలు మార్గాల్లో వీటిని నడపనున్నారు. కాచిగూడ-కాకినాడటౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 26వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి.
పలు రైళ్ల పొడిగింపు
సంక్రాంతికి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ మార్గాల్లో పది స్పెషల్ ట్రైన్స్ ను పొడిగిస్తూ ప్రకటన చేసింది. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకూ షెడ్యూలును బట్టి ఈ రైళ్ల రాకపోకలుంటాయని అధికారులు తెలిపారు. తిరుపతి - అకోలా, పూర్ణ - తిరుపతి, హైదరాబాద్ - నర్సాపూర్, తిరుపతి - సికింద్రాబాద్, కాకినాడ టౌన్ - లింగపల్లి స్టేషన్ల మధ్య స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రజలు పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు వెళ్తుంటారు. దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లతో వారి ఇబ్బందులు కొంత వరకైనా తీరే అవకాశముంది.