South Central Railway: సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. విజయవాడ (Vijayawada) డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లు కొన్ని ముఖ్యమైన రైళ్లను పునరుద్ధరిస్తూ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ (Janmabhumi Express 12805/12806), విజయవాడ - కాకినాడ పోర్ట్ (17257), చెంగల్పట్టు -కాకినాడ పోర్ట్ (17643) రైళ్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 25 నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ యథావిధిగా నడవనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
కాగా, నిడదవోలు - కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 11 వరకూ పలు రైళ్లను ఇటీవల రద్దు చేసినట్లు రైల్వే అధికారులు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిల్లో ముఖ్యమైన జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సర్వీసులు ఉండగా.. ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ప్రత్యామ్నాయ సర్వీసులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో రైళ్లను పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అటు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను పొడిగిస్తూన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం నడుస్తోన్న రైళ్లను మరో 2 నెలల పాటు పొడిగించారు. తిరుపతి - అకోల, అకోల - తిరుపతి , పూర్ణ - తిరుపతి , తిరుపతి - పూర్ణ , హైదరాబాద్ - నర్సాపూర్, నర్సాపూర్ - హైదరాబాద్ రైళ్లను పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, సికింద్రాబాద్ - తిరుపతి ), తిరుపతి - సికింద్రాబాద్ , కాకినాడ టౌన్ - లింగంపల్లి , లింగంపల్లి - కాకినాడ సర్వీసులను అక్టోబర్ వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.