కానిస్టేబుల్ అభ్యర్థులు మళ్లీ రోడ్డెక్కారు. జీవో 46 ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలు చేశారు. కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో 46 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు వచ్చే సమయంలో కొంత మంది అభ్యర్థులు ఉద్యోగాలు రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆందోళనకు దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఆరోపించారు.
2018 నోటిఫికేషన్ ఆధారంగా నియమకాలు చేపడితే అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సమానంగా న్యాయం జరుగుతుందని భావించే.. రాష్ట్ర ప్రభుత్వం 2022 లో ఇచ్చిన నోటిఫికేషన్ లో జీవో 46 ను తీసుకొచ్చిందన్నారు. ఇలాంటప్పుడు జీవో 46 ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్ మెంట్ బోర్డు జోక్యం చేసుకొని కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఫలితాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, జీవో 46 ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంత మంది కానిస్టేబుల్ అభ్యర్థులు కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. గతవారం వారు మూకుమ్మడిగా సెక్రటేరియట్ ను ముట్టడించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే జీవో 46 తో గ్రామీణ ప్రాంతవాసులకు అన్యాయం జరుగుతుందని వారు నిరసనకు దిగారు.
ఇక ఇలా ఉంటే.. జీవో 46 రద్దు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని మరో వర్గం కానిస్టేబుల్ అభ్యర్థులంటున్నారు. అప్పులు చేసి, తిప్పలు పడి చదువుకుంటూ సాధించుకున్న కొలువులకు ఎసరు పెట్టొద్దని.. జీవో కోసం అవగాహన లేకుండా కొందరు పెద్దలు వెనుకుండి అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే జీవో 46 విషయంలో కానిస్టేబుల్ అభ్యర్థులు రెండు వర్గాలుగా చీలిపోయి ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఫలితాలను విడుదల చేస్తుందా.. లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.