Amavasya 2024: శ్రావణ బహుళ.. పొలాల అమావాస్య.. ఈ వ్రతం చేస్తే పిల్లలకు అపమృత్యు దోషం తొలిగిపోతుంది

ఈ ఏడాది శ్రావణ బహుళ అమావాస్య తిథి సెప్టెంబర్ 2న ప్రారంభమై సెప్టెంబర్ 3న ఉదయం ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈరోజున నది స్నానం, పూజ, ధ్యాన కార్యక్రమాలను చేసుకుంటే మంచిది. ఉపవాసం , దానధర్మాలు చేయడం, పెద్దలకు పితృ కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు ఉంది.

New Update
Amavasya 2024: శ్రావణ బహుళ.. పొలాల అమావాస్య.. ఈ వ్రతం చేస్తే పిల్లలకు అపమృత్యు దోషం తొలిగిపోతుంది

Amavasya 2024: మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే పొలాల అమావాస్య అంటాం. అయితే ఈ సంవత్సరం అమావాస్య ఏరోజు వచ్చిందనే గందరగోళం నెలకొంది. అది సోమవారమా, మంగళవారమా తెలియట్లేదు..అయితే అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఎప్పటివరకు ఉంటుంది ఆ రోజున ఏం చేయాలి అనే వివరాలను మనం ఇప్పుడు చూద్దాం.

అమావాస్య నిర్ణయం..

  1. హిందూ క్యాలండర్ ప్రకారం ఈ సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య తిథి సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 5.59 నిమిషాలకు అంటే సూర్యోదయ కాలంలో ప్రారంభమై, మరుసటి రోజున అంటే మంగళవారం సెప్టెంబర్ 3న ఉదయం ఆరు గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 2వ తేదీన అమావాస్య జరుపుకోవాలి. తెల్లవారుజామున 4.30నుంచి 7.45 మధ్యలో స్నానం, పూజ, ధ్యాన కార్యక్రమాలను చేసుకుంటే మంచిది. ఈ అమావాస్య సోమవారం రోజున వచ్చింది కాబట్టి దీన్ని సోమవతీ అమావాస్య అని కూడా అంటారు.

వివిధ పేర్లతో...

  • ఉత్తరాదిన దీన్ని బాద్రపద అమావాస్యగా పిలుస్తారు. ఎందుకంటే వారికి ఇది బాధ్రపద మాసం కాబట్టి. ఇక తమిళనాడు ప్రజలు దీన్ని అవని అమావాస్య అన్న పేరుతో పిలుస్తే, మార్వాడి వాళ్లు భడో అమావాస్య లేదా భడీ అమావాస్య అన్న పేరుతో పిలుస్తారు. కానీ తెలుగు ప్రజలు మాత్రం శ్రావణ బహుళ అమావాస్యను పొలాల అమావాస్యగా జరుపుకుంటారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో పొలాల అమావాస్యను పెద్ద పండుగలా జరుపుకుంటారు.

పొలాల అమావాస్య:

  • వ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో “పోలాల అమవాస్య వ్రతం” ఒకటి. దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య’ లేదా ‘పోలాల అమావాస్య , పోలాంబవ్రతం’ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు ‘అపమృత్యు భయం’ తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతారని అంటారు. ఈరోజున ఉదయాన్నే లేచి, తలస్నానంచేసి , ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి , ఇంటికి చేరుకుని పూజాగదిలో పోలేరమ్మను పసుపుకొమ్ముతో గానీ , పసుపుతోగాని చేసుకొని ప్రతిష్టించుకుని పూజ చేయాలి. ఈ పూజావిధానములో పార్వతీ దేవి అష్ణోత్తరం చదవుతూ ఉండడం విశేషం. పూజ ముగించిన అనంతరం పసుపు పూసిన దారానికి పసుపుకొమ్మ కట్టి తయారుచేసుకున్న తోరము’ ఒకదానిని తీసుకుని పోలేరమ్మకు సమర్పించడంతో పాటూ , మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి. ఈ విధంగా పూజచేసి ‘పెరుగు అన్నం’ ను నైవేద్యంగా సమర్పించి పూజ ముగించాలి. ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమవాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందనీ , సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

సోమవతి అమావాస్య:

  • ఈసారి అమావాస్య సోమవారం రావడం వల్ల ఈరోజు సోమవతి అమావాస్య కూడా..ఈరోజు శివారాధనకు విశేషమైన రోజుగా చెప్పొచ్చు. సోమవతి అమావాస్య రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేసి శివున్ని బిల్వపత్రాలతో పూజిస్తే అది కూడా రాహుకాలంలో చేస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. ఒకవేళ అభిషేకంచేయడం కుదరని వారు కనీసం శివ స్తోత్రాలను కానీ, శివపంచాక్షరిని కానీ జపిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈరోజున ఉపవాసం ఉండడం, దానధర్మాలు చేయడం, పెద్దలకు పితృ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు