గొడవలు పడడం, ఇళ్లు తగలపెట్టుకోవడం, అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, ఇతరులను చావబాదడం, షాపులు లూటీ చేయడం.. ఏ రాష్ట్రంలో నిరసనలు హింసకు దారి తీసినా ఇలాంటివి జరగడం సర్వసాధారణం. అయితే ముగ్గురు మహిళలను బట్టలు లేకుండా.. రోడ్డుపై తరుముతూ, గేలీ చేస్తూ, గోల చేస్తూ, వికృతంగా అరుస్తూ, బూతులు తిడుతూ, రహదారి పొడుగునా పరిగెత్తించి..చివరకు పొలాల్లోకి తీసుకెళ్లి ఆత్యాచారం చేశారంటే నమ్మగలరా..? ఇది జరిగింది ఎక్కడో కాదు..శాంతికి, అహింసకు పాఠాలు నేర్పిన మన ఇండియాలో.
ఒకప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఎంతో ఆనందంగా గడిపిన మణిపూర్(Manipur) ప్రజల్ని రోడ్డుపైకి తీసుకొచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ల అప్పగించి చూస్తుండగానే జరిగిన ఘోరమిది. యావత్ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండకు, జరుగుతున్న నేరాలకు, ఘోరాలకు, దారుణాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న ఈ ఘటనపై అన్నివైపుల నుంచి అగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బీజేపీ ఏం చేసినా సమర్థించే కమల మద్దతుదారులు సైతం ఈ ఘోరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్నమొన్నటివరకు మణిపూర్ అల్లర్లపై పల్లెత్తు మాట మాట్లాడని ప్రధాని మోదీ(modi) సైతం తాజాగా స్పందించారంటే ఈ దారుణం ఎలా సాగిందో ఊహించుకోవచ్చు.
సుప్రీంకోర్టు సీరియస్:
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు(Supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని ప్రశ్నించింది. ఈ ఘటన చాలా బాధాకరమని అభిప్రాయపడుతూనే.. మహిళలపై ఇలాంటి ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని కుంబద్దలుకొట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని లేకపోతే తామే తీసుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మౌనం వీడిన మోదీ:
మణిపూర్ అల్లర్లు తీవ్రరూపం దాల్చి రెండు నెలలు దాటినా నిన్నటివరకు ప్రధాని మోదీ అక్కడి పరిస్థితులపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేక విమర్శలకు దారి తీసింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో 'కేరళ స్టోరీ' సినిమా గురించి కూడా వ్యాఖ్యలు చేసిన మోదీకి..మణిపూర్ హింసాకాండపై మాట్లాడే తీరిక లేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత విదేశీ టూర్లలో బిజీగా ఉండిపోయిన మోదీ..పార్లమెంట్ సమావేశాలకు ముందు మణిపూర్ అల్లర్లపై వ్యాఖ్యలు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠినంగా శిక్షిస్తామన్నారు. మణిపూర్ ఘటన సిగ్గుపడాల్సిన విషయమని.. ఇలాంటి దురాగతాలను సహించమన్నారు ప్రధాని. తక్షణమే ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని ఆదేశించారు. మహిళలను గౌరవించే సంస్కృతి మనదంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం మోదీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇన్నాళ్లు మౌన్ మోదీ లాగా ఉన్న ప్రధాని సడన్‌గా 'టాక్' మోదీగా ఎలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు చివాట్లు పెడితే కానీ స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ ఘటనను అస్త్రంగా చేసుకుంటాయని..అందుకే సమావేశాలకు కొద్ది నిమిషాల ముందు స్పందించారని ఆరోపిస్తున్నారు.
ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది:
అది మే4, 2023 తౌబాల్ జిల్లా..మీతీలు ఆధిపత్యంగా పరిగణించే ప్రాంతమది. మధ్యాహ్నం 3 గంటలవుతుంది.. అంతా తమ పని తాము చేసుకుంటున్నారు. ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లోకి చొరబడ్డారు. కనిపించిన వాళ్లపై దాడి చేస్తూ పోయారు. హత్యలు చేశారు, అత్యాచారలకు పాల్పడ్డారు. మధ్య వయసు మహిళలే టార్గెట్‌గా క్రూర మృగాలులాగా వారిపై విరుచుకుపడ్డారు. పోలీసుల ముందే ఓ మహిళ తండ్రిని హత్య చేశారు. ఆ తర్వాత ముగ్గురు మహిళలను బలవంతంగా బట్టలు విప్పించారు. వారిలో ఒకరికి 21 ఏళ్లు, మరొకరికి 42 ఏళ్లు, ఇంకొకరికి 52 ఏళ్లు. వాళ్ల ముగ్గురిని రోడ్డుపై నగ్నంగా నడవాలంటూ వెంబడించారు. తాకకూడని చోట తాకుతూ ఊరంతా వారిని ఊరేగించారు. తర్వాత అందులో 21ఏళ్ల యువతిని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మే 18న పోలీసులకు ఈ ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందింది. ఈ కేసులో జూన్ 21న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వీడియో వైరల్ కావడంతో, పోలీసులు ఇవాళ(జులై 20) ఉదయం ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. వైరల్ వీడియోలో ఆకుపచ్చ టీ షర్ట్ ధరించిన నిందితుడి పేరు ఖుయ్రం హెరాదాస్. అతనే ఈ కీచక పర్వం వెనుక అసలు సూత్రదారి.
ఇక డిజినియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం తలపెట్టిన భారీ ర్యాలీకి కొన్ని గంటల ముందు ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యింది. బాధిత మహిళలు ఆదివాసి గిరిజనులుగా ప్రచారం జరుగుతోంది. ఘటన జరిగి 75రోజులు దాటినా వీడియో బయటకు వస్తే కానీ పోలీసులు, ప్రభుత్వాలు సీరియస్ తీసుకోరా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. అసలు వీడియో బయటకు రాకపోయి ఉంటే వీళ్లంతా కనీసం స్పందించేవాళ్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవతాలను పూజించే దేశమని వెళ్లిన ప్రతిదేశానికి చెప్పుకునే బీజేపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ పౌర సమాజం ఈ ఘటనను ఇప్పటికే చాలా సీరియస్‌గా తీసుకుంది.
అసలు ఈ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి?
ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకి వేర్వేరు చట్టాలు, అధికారాలని అమలు చేయడమే ఈ రావణకష్టానికి, హింసాకాండకి కారణం. షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ జాతుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత మణిపూర్‌లో ఉన్న కుకీ, నాగా ప్రజలకి ఎస్టీ హోదా కల్పించారు. ఇక కుకీలు, నాగాలు మతం మారి క్రిస్టియానికటీ తీసుకున్నారు. ఆయినా కూడా వారికి ఎస్టీ హోదాని రద్దు చేయలేదన్నదానిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే కొండ దిగువ ప్రాంతంలో ఉండే మీతీ ప్రజలని జనరల్ కేటగిరీలో ఉంచేయడం దారుణన్న అభిప్రాయాలు వినిపించాయి. అసలు మణిపూర్‌లో మూల వాసులుగా ఉన్న మీతీ ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కులు లేకపోవడం అక్కడి ఘర్షణలకు ప్రత్యేక కారణం. లోయలో నివాసముండే మీతీ ప్రజల స్థలాలని ఎవరైనా కొనవచ్చు. బయటి వాళ్లు అక్కడికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకోవచ్చు, శాశ్వత నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, మియాన్మార్ నుంచి అక్రమంగా మణిపూర్‌లోకి ప్రవేశించిన వలస దారులు మీతీ ప్రజల అవకాశాలని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా భిన్న వర్గాల మధ్య మొదలైన అల్లర్లు ఇప్పుడు హద్దుదాటి మహిళలను నగ్నంగా ఊరేగించి ఆత్యాచారం చేసే వరకు వెళ్లాయి.