SKYMET WEATHER : దేశవ్యాప్తంగా ఈ యేడాది 2024 కురవబోయే వర్షాలకు సంబంధించి అంచనాను ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో నాలుగు నెలలపాటు సగటు (ఎల్‌పీఏ) 898.6 మిల్లీ మీటర్లకు గాను 102శాతం వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనికి 5 శాతం అటూ ఇటుగా ఉండొచ్చని అంచనా వేసింది.
దేశ సగటు 87 సెంటీమీటర్లు..
ఇక ఈ నాలుగు నెలల కాలానికి దేశ సగటు 87 సెంటీమీటర్లు. కాగా దీర్ఘకాలిక సగటులో 96 నుంచి 104 శాతం వర్షాలు కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. నైరుతి రుతుపవనాలపై కొద్ది వారాల క్రితమే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) 2024 సంవత్సరానికి గాను తన తొలి అంచనాలను వెల్లడించగా 2024, జనవరి 12న విడుదల చేసిన ముందస్తు అంచనాల్లోకూడా స్కైమెట్.. ఈ ఏడాది వర్షాకాలం సాధారణంగానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం నెలకొని ఉన్న ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా లా నినా వైపు మళ్లుతున్నాయని పేర్కొంది. లా నినా వాతావరణ పరిస్థితుల్లో రుతుపవనాలు బలంగా ఉంటాయని, సూపర్ ఎల నినో నుంచి బలమైన లా నినాకు జరిగే పరివర్తన మంచి వానాకాలాన్ని అందిస్తుందని వెల్లడించింది.
వాయువ్య ప్రాంతాల్లో సమృద్ధిగా..
అయితే రాబోయే వర్షాకాలం సీజన్ ఎల్ నినో ప్రభావంతో బలహీన రుతుపవనాలతో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక సీజన్ రెండో భాగంలో ప్రాథమిక దశపై తిరుగులేని ఆధిక్యం చూపే అవకాశం ఉందని స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్‌సింగ్ చెప్పారు. 'నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేసే మరో అంశమైన హిందూ మహాసముద్ర ద్విధ్రువం కూడా ఈ ఏడాది సానుకూలంగానే ఉంటుంది. దక్షిణ, పశ్చి, వాయువ్య ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు పడతాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కీలకమైన వర్షాభావ ప్రాంతాల్లో కూడా తగినంత వర్షం పడుతుంది. తూర్పు ప్రాంతంలోని బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సీజన్ ప్రారంభ మాసాలైన జూలై, ఆగస్ట్‌లలో వర్షాభావ పరిస్థితులు గరిష్ఠంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తొలి రెండు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. జూన్‌లో 87 సెంటీమీటర్లకు గాను 16.53శాతం వర్షాలు పడే అవకాశం ఉంది. జూలైలో నైరుతి సాధారణంగా ఉండే అవకాశాలు 60శాతం ఉన్నాయి. జూలైలో దాదాపు 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకశాలున్నాయని వెల్లడించారు.
సౌత్ ఇండియాలో అంతంతమాత్రమే..
అలాగే ఆగస్ట్‌లో 50శాతం సాధారణ వర్షపాతం పడే చాన్స్ ఉన్నట్లు స్కైమెట్ తెలిపింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి 20శాతం అవకాశం ఉందని, ఆగస్ట్‌లో మొత్తంగా 25.4 సెంటీమీటర్ల వర్షపాతం ఉండొచ్చని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూలై, ఆగస్ట్ నెలల్లోనే దేశంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతానికి 60 శాతం, అధిక వర్షపాతానికి 20శాతం అవకాశాలు ఉన్నాయి. మొత్తం వర్షాకాల సీజన్‌లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాలతో సహా ఈశాన్య ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులుంటాయని MD అంచనా వేసింది.