Siemens: స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కాం జరిగిదంనే ఆరోపణలు నిరాధారమని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200కు పైగా ల్యాబ్‌లను ప్రారంభించినట్లు వివరించారు. సిమెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ జరగలేదని సీఐడీ ఆరోపణలు అవాస్తవమన్నారు. APSSDC ప్రభుత్వ సంస్థ కాదా? అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు వింటుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేయడం సులువని.. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారని తెలిపారు. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని.. కోర్టులకు అన్ని వివరాలు చెబుతామని ఆయన వెల్లడించారు.
2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చిందన్నారు. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారన్నారని.. వారిలో ఇప్పుడు చాలామంది మంచి ఉద్యోగాలలో ఉన్నారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో APSSDC ఎండీ కూడా మెచ్చుకున్నారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు అదే APSSDC ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయని గుర్తుచేశారు. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపి కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉందన్నారు. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని ఎలా తేల్చేస్తారని బోస్ ప్రశ్నించారు.
ప్రభుత్వం మోపిన అవినీతి ఆరోపణల కేసు ఎలా ఉందనే విషయంలో ఆయన ఓ ఉదాహరణ కూడా చెప్పారు. "విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు." అని ఉదహరించారు. స్కిల్ డెవలప్‍మెంట్ చాలా విజయవంతమైన ప్రాజెక్టు.. 2016లో కేంద్రం విజయవంతమైన నమూనాగా కూడా ప్రకటించిందన్నారు. ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశామని.. ఇప్పుడు కూడా చేస్తున్నామని వివరించారు. కియా మోటర్స్ సంస్థ కోసం మానవ వనరులకు గొప్పగా శిక్షణ ఇవ్వడంపై ఆ సంస్థ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసిందన్నారు. రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.10 కోట్లే సీమెన్స్ సంస్థకు వచ్చిందని బోస్ స్పష్టంచేశారు. ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదని.. ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం పలువురి జీవితాలపై ప్రభావం చూపుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: జగన్ జైలుకు పోవడం ఖాయం: యనమల